- జీఆర్‌ఎంబీపై రాష్ట్ర ఇరిగేషన్ ఉన్నతాధికారుల అసహనం.
- బనకచర్ల, గోదావరి అనుసంధాన ప్రాజెక్ట్ లపై మండిపాటు.
- మీకు తెలిసే ఇదంతా జరుగుతోందని ఆరోపణ.
- ఐదు నెలల క్రితం కేంద్రం నుంచి లేఖ నుంచి వచ్చిన లేఖను దాచిపెట్టారు.
- ఏపీ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తోన్నా మౌనమెందుకూ..?
- తెలంగాణపై పడే ప్రభావంపై వివరాలివ్వాలి.
- బనకచర్ల అంశంపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోన్న ఏపీ.
- బనకచర్ల ప్రాజెక్టుకు ఇంకా డీపీఆర్ తయారు చేయలేదని వివరణ.
- నేడు పోలవరం ప్రాజెక్టు అథారిటీతో తెలంగాణ ఇరిగేషన్ అధికారుల భేటీ.
- హాజరుకానున్న ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు, సీడబ్ల్యూసీ సభ్యులు.
- భద్రాచలం,మణుగూరు ప్లాంట్, కిన్నెరసాని – ముర్రేడు ప్రాజెక్టుల ముంపుపై చర్చ.
- భద్రాచలంకు పోలవరం బ్యాక్ వాటర్ సర్వే అంశంపై కీలక నిర్ణయం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : గోదావరి నదిపై బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణ వివాదం ఏపీ, తెలంగాణల మధ్య అగ్గి రాజేస్తోంది. ఏపీ నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని తెలంగాణ తేల్చి చెప్పింది. ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) తన బాద్యతను విస్మరించినా.. తప్పుకున్నా ఢిల్లీలో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించింది. ఈ సమస్యకు జీఆర్‌ఎంబీ పరిష్కారం చూపుతుందనే నమ్మకం లేదని ఆ బృందం ముందు స్పష్టం చేసింది. ఇటు ఏపీ సైతం ఆ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం అంశం ప్రతిపాదన దశలోనే ఉందని.. ఇంకా డీపీఆర్ కూడా తయారు కాలేదని స్పష్టం చేసింది. గోదావరి -బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రం వ్యక్తం చేసిన అభ్యంతరాలపై సోమవారం హైదరాబాద్ లోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన జీఆర్‌ఎంబీ సమావేశం హాట్ హాట్ గా జరిగింది. మూడు గంటల పాటు జరిగిన భేటీలో నీటి వాటాలు, ప్రాజెక్టుల చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) అనిల్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఆర్‌ఎంబీపై రాహుల్ బొజ్జా, ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ అసహనం వ్యక్తం చేశారు. ప్రధానంగా జీఆర్‌ఎంబీ కార్యదర్శి అజగేషన్ వ్యవహార శైలిని ఆయన ప్రస్తావించారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే బోర్డు సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా జీఆర్‌ఎంబీలో డిప్యుటేషన్‌పై పని చేస్తున్న ఏపీ, తెలంగాణకు చెందిన అధికారులను వేధిస్తున్నారని, మహిళా ఉద్యోగులను అసభ్యకర మాటలతో దూషిస్తున్నారని ఫిర్యాదు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం సమాచారం, వివరాలు దాచిపెడుతోందని ఆరోపించారు. ప్రాజెక్టు అంశంపై బోర్డుకు కేంద్రం నుంచి లేఖ వచ్చి ఐదు నెలలు గడిచాయని చెప్పారు. అయినా ఈ లేఖల గురించి తమకు కనీస సమాచారం ఇవ్వలేదని జీఆర్‌ఎంబీపై మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టు పూర్తి వివరాలు, దాంతో తెలంగాణపై పడే ప్రభావం ఇతర వివరాలు అందించాలని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు జీఆర్ఎంబీని కోరారు. బనకచర్ల పై గతేడాది డిసెంబర్ 10న బోర్డుకు ఏపీ నుంచి సమాచారం వచ్చిందని, బోర్డుకు ఇన్ పుట్ ఉన్నా తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించింది. ప్రాజెక్టులపై ఇన్ పుట్స్ ఇవ్వకుండా పనులు చేస్తామంటే కుదరని తెలిపింది. వరద నీళ్ల పేరుతో 40 వేల క్యూసెక్కులు తీసుకెళ్తామని ఏపీ చెబుతోందనీ.. దానిమాటున తెలంగాణకు కేటాయించిన గోదావరి జలాలను తమ ప్రాంతానికి తీసుకెళ్లే ప్రమాదం లేకపోలేదని అభిప్రాయపడింది. ఇదీలావుంటే గోదావరి నుంచి ఏటా వేలాది టీఎంసీల జలాలు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయని, అలా వాడుకోకుండా సము ద్రంలో కలుస్తున్న వరద జలాలనే బనకచర్లకు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. వాస్తవానికి 2 రాష్ట్రాలకు గోదావరిలో కేటాయించిన 1,486 టీఎంసీలకు మించి ఒక చుక్క ఎక్కువ వాడుకునేందుకు హక్కులు లేవు. నదీ జలాల పంపకంలో భాగంగా ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణకు 968 టీఎంసీలు, ఏపీకి 516 టీఎంసీల చొప్పున నీటి కేటాయింపులున్నాయి. కానీ ఇక్కడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలివిగా వ్యవహరించి, సముద్రంలో కలుస్తున్న జలాల్లో సర్‌ప్లస్ ఉన్న ఏడాదిలోనే 200 టీఎంసీలను తరలిస్తామంటున్నది.
- బనకచర్లతో భారీ నష్టం!
బేసిన్ అవసరాలకు తెలంగాణ నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టులకూ అడ్డుపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నది నుంచి ప్రణాళిక ప్రకారం జల దోపిడికి కుట్ర పన్నుతుంది. ఇటు కృష్ణా, అటు గోదావరి బేసిన్‌లో లేని రాయలసీమకు కర్నూలు జిల్లా పాములపాడు మండలంలో ఉన్న బనకచర్ల హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీటిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నది. నీటి తరలింపు విషయంలో ఆంధ్ర ప్రదేశ్ నాగార్జునసాగర్ కుడి కాల్వనే ఓ రిజర్వాయర్‌గా మార్చి బనకచర్లకు నీటిని తరలించేలా ప్లాన్ చేసింది. మొదటగా పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీలోకి తాడిపూడి మెయిన్ కెనాల్ ద్వారా నీటిని తరలించి.. అక్కడి నుంచి రెండో దశలో సాగర్ కుడి కాల్వ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలించేలా ప్రాజెక్టుకు డిజైన్ చేసింది. ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు మధ్యలో ఆరు లిఫ్ట్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయనున్నది. ప్రకాశం బ్యారేజీ, పులిచింతల ప్రాజెక్టుకు మధ్య వైకుంఠపురం వద్ద ఇంకొ బ్యారేజీనీ నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇదీలావుంటే.. సాగర్ కుడి కాల్వను.. ఆ కాలువ 80వ కిలోమీటర్ పాయింట్ వద్ద వెడల్పు చేసి ఆ పాయింట్ వద్దనే మరో రిజర్వాయర్‌గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి వరకు ఐదు లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోయాలని భావిస్తున్న ఆంధ్ర ప్రభుత్వం కుడి కాల్వ పాయింట్ తర్వాత మరో లిఫ్ట్‌ను నిర్మించి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు నీటి తరలింపునకు ప్లాన్ చేసారు. ఇక మూడో దశలో భాగంగా బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కి మూడు లిఫ్టులు, రెండు సొరంగాల ద్వారా నీటిని తరలిస్తారు. ఈ మధ్యలో వచ్చే ఒక సొరంగం పొడవు దాదాపుగా 25.6 కిలోమీటర్లు కావడం గమనార్హం. ఈ మొత్తం జీ-బీ ప్రాజెక్టు కోసం రూ.80,112 కోట్లు ఖర్చు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. స్టేజ్ 1 (పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు)లో 198 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాల్వలను తవ్వనున్నది. స్టేజ్ 2లో 84 కిలోమీటర్లు, మూడో స్టేజ్‌లో 108.4 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వలతో నీటిని తరలించనున్నది. మొత్తంగా 400.4 కిలోమీటర్ల దూరానికి నీటిని తరలించనున్నది.
- నేడు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం..!
గోదావరి నదిపై ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రంలో పొంచి ఉన్న ముంపు ముప్పుపై చర్చించేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ.. తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో నేడు జలసౌదలో కీలక భేటీ నిర్వహించనున్నది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు, సీడబ్ల్యూసీ సభ్యులు హాజరుకానున్నారు. ఇందులో పోలవరం నిర్మాణంతో జరిగే భద్రాచలం ముంపు, మణుగూరు ప్లాంట్ వరద ముప్పు, కిన్నెరసాని – ముర్రేడు ప్రాజెక్టుల ముంపు, భద్రాచలంకు పోలవరం బ్యాక్ వాటర్ సర్వే అంశాలపై చర్చ జరగనున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రంలో ముంపు సమస్యల తీవ్రత పెరుగుతోందని, తెలంగాణలో లక్ష ఎకరాలకు పైగా భూముల్లో పంటలు మునిగిపోతాయని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సమగ్ర నివేదిక ఇచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి బ్యాక్ వాటర్ ముప్పు ఉంటుందని అందులో స్పష్టం చేసింది. ఇక ఎఫ్ఆర్ఎల్ వద్ద నీటినిల్వ ఉంటే ముంపు ఎక్కువ ఉంటుందని తెలిపింది. ముర్రేడువాగు, కిన్నెరసాని నదుల పరిసరాలు మునుగుతాయని పేర్కొంది. అయితే ఆంధ్ర ప్రభుత్వం మాత్రం వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను నిల్వచేసి వేలాది ఎకరాల సాగుభూమిని సస్యశ్యామలం చేయడానికి.. లక్షలాది మంది ప్రజల గొంతు తడిపేందుకు ప్రాజెక్టును నిర్మిస్తున్నామని వాదిస్తోంది.