Take a fresh look at your lifestyle.

ఏడుగురు కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం

  • ప్రమాణ స్వీకారం చేయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీ లు సోమవారం తెలంగాణ శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. నాటి ఎన్నికల్లో బీజేపీ నుంచి మల్కా కొమురయ్య, అంజి రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రఘునందన్ రావులు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి ఏకగ్రీవం ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం (సీపీఐ)లతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే నల్గొండ- ఖమ్మం- వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు బీజేపీ ఎమ్మెల్సీలు మల్కా కొమురయ్య, అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు కలిసి ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేంద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ ముందున్న గన్ పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. ఇదిలావుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్వల్ఫ అస్వస్థత కారణంగా ప్రమాణస్వీకారం చేయలేదు. ఆయన మరో రోజున ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

  • జీవితాంతం కాంగ్రెస్‌లోనే – అద్దంకి దయాకర్

జీవితాంతం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన అద్దంకి దయాకర్ అన్నారు. తనకు వచ్చే వేతనంలో 25 శాతం కాంగ్రెస్ పార్టీకే ఇస్తాని, భవిష్యత్‌లో మరో 25 శాతం వేతనాన్ని తెలంగాణ అమరవీరుల కుటుంబానికి అందజేస్తానని అద్దంకి దయాకర్ చెప్పారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వ్యవహరిస్తానని తెలిపారు.

  • రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురువేస్తాం- మల్కా కొమురయ్య

రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురువేస్తామని బీజేపీ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య అన్నారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం అని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ గెలుపు రుజువు చేసిందన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సమస్యలపై పోరాటం చేస్తామన్నారు.

  • నిరుద్యో సమస్యలపై మండలిలో గొంతు విప్పుతా – అంజిరెడ్డి

శాసనమండలిలో నిరుద్యోగుల సమస్యలపై గొంతు విప్పుతానని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. విద్యాసంస్థలకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. హెచ్‌సీయూ విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడం దుర్మార్గమన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

Leave A Reply

Your email address will not be published.