ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
నాణ్యమైన బోధన మెరుగైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ లెర్నింగ్, విద్యార్థుల సంక్షేమం, సమాజ భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో విద్యా వారోత్సవాల్లో భాగంగా నియోజకవర్గ స్థాయి లో మున్సిపల్ చైర్మన్, సర్పంచ్, వార్డు మెంబర్ లకు వర్క్ షాప్ నిర్వహించారు. విద్యా శాఖ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రోజుకొక కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్ పనులను పూర్తి చేసుకుని అభివృద్ధి పథంలో ముందుండేలా ప్రజా ప్రభుత్వం విద్య పై ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద జిల్లాలో పాఠశాలల లోని మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్స్ , అదనపు తరగతి గదులు, తదితర మరమ్మత్తులు చేసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత నిస్తూ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, కిచెన్ షెడ్, సోలార్ ఫెన్సింగ్, తదితర పెండింగ్ పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుందన్నారు. ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్స్ లో ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఇంటర్నేషనల్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మెరుగుపరచడం జరుగుతుందని అందులో భాగంగా ప్రతి పేద విద్యార్థి మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగేలా అన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. నియోజకవర్గ స్థాయిలో కూడా పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు.విద్యతోఏదైనా సాధ్యం అవుతుందనీ. జూన్ 2 నుండి ప్రీ- ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులందరికీ ఉదయానే అల్పాహారం, పాలు, జావ వంటివి అందించడం జరుగుతుందని తదనుగుణంగా విద్యార్థుల్లో సృజనాత్మకత మెరుగుపడుతుందని అన్నారు. గతంలో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని అన్నారు. జిల్లాలో పదవ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా ఉత్తీర్ణత ఫలితాలు విద్యార్థులు సాధించారన్నారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ మన జిల్లాలో పదవ తరగతి పరీక్షలలో మంచి మార్కులు వచ్చాయని ,గ్రామాలలో ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చూడాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు దీటుగా, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక వసతుల సదుపాయాలు, మంచి వాతావరణంలో స్కూల్స్ ఉన్నాయన్నారు. ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అల్పాహారం, రాగి జావా, మధ్యాహ్నం భోజనంలో మంచి పౌష్టికాహారం అందించడం జరుగుతుందని అన్నారు. ఇంటర్మీడియట్ లో కూడా వచ్చే విద్యా సంవత్సరం నుండి మధ్యాహ్నం భోజన పథకం అమలు చేయడం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ఎక్కువ మొత్తంలో చేర్పించేందుకు కృషి చేయాలి అన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా 11 నుండి 17 వరకు విద్యా వారోత్సవాలు జరుగుతుందని అన్నారు. విద్యార్థులు ప్రవేట్ పాఠశాలకు వెళ్లకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగాస్థానిక ప్రజా ప్రతినిధులు చూడాలన్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ లను సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో శోభారాణి, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, మండల ఎడ్యుకేషన్ అధికారులు,సర్పంచ్ లఫోరం అధ్యక్షులు కొప్పుల వెంకటరెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీ వాణి, వైస్ చైర్మన్ మంజుల, ఆలేరు మున్సిపల్ చైర్ పర్సన్ బాలామణి, సర్పంచులు, కౌన్సిలర్లు సంబధిత అధికారులు పాల్గొన్నారు