కబ్జాల కోరల్లో కే పి హెచ్ బి కాలనీ : పదేళ్ల విధ్వంసంపై విచారణ జరపాలి!
114 KPHB డివిజన్ సమస్యలపై గళమెత్తిన గాధే శివ
హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ఫిబ్రవరి 11:
గత పదేళ్ల కాలంలో కుకట్‌పల్లి నియోజకవర్గం, ముఖ్యంగా 114 KPHB డివిజన్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో జరిగిన భూ కబ్జాలు, అభివృద్ధి లోపాలపై కాంగ్రెస్ యువ నాయకులు గాధే శివ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులుగా బాధ్యతలు చేపట్టిన వారు ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యారని, వారి నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన మండిపడ్డారు.
కబ్జాలకు కేరాఫ్ అడ్రస్‌గా పార్కులు
ప్రజల వినియోగం కోసం కేటాయించిన పార్కు స్థలాలు భారీగా కబ్జాలకు గురయ్యాయని గాధే శివ ఆరోపించారు. ముఖ్యంగా గోపాల్ నగర్, KPHB 6వ ఫేజ్ వంటి ప్రాంతాల్లో పార్కు స్థలాలను కాజేయడమే కాకుండా, అక్కడ జైలు గోడల వంటి నిర్మాణాలు చేపట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. అయితే, HYDRA మరియు కాంగ్రెస్ పార్టీ చొరవతో ఇప్పటికే కొన్ని పార్కు స్థలాలను కబ్జాల నుంచి విడిపించామని, భవిష్యత్తులో మరిన్ని చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పేరిట మోసం?
KPHB రమ్య గ్రౌండ్స్‌లో ఎన్టీఆర్ పేరుతో మెమోరియల్ స్కూల్ నిర్మిస్తామని చెప్పి పెద్ద ఎత్తున నిధులు వసూలు చేసి, నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపివేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న ఇనుము కూడా దొంగలించబడిందని, ఈ కుంభకోణంపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు.
పేదల బాధలు వర్ణనాతీతం
LIG ఫ్లాట్లు: ఫోర్త్ ఫేజ్‌లో నిర్మించిన 630 LIG ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటంతో లబ్ధిదారులు నరకం చూస్తున్నారని ఆవేదన చెందారు.
డబుల్ బెడ్ రూమ్స్ & రేషన్ కార్డులు:
గత పదేళ్లలో పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులోనూ పారదర్శకత లేదని విమర్శించారు.
మౌలిక సదుపాయాలు:
సర్దార్ పటేల్ నగర్, భగత్ సింగ్ నగర్, వసంత్ నగర్, డ్రీమ్ వ్యూ కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, వీధి లైట్లు కూడా వెలగడం లేదని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు.
మహిళలు, జర్నలిస్టుల సమస్యలు
పార్కుల్లో మహిళల కోసం కనీసం టాయిలెట్లు, వాకింగ్ ట్రాక్‌లు, బోర్‌వెల్స్ వంటి కనీస సదుపాయాలు కల్పించలేదని శివ విమర్శించారు. మహిళా సంఘాలకు, జర్నలిస్టులకు సొంత భవనాలు లేకపోవడం గమనార్హం.
ట్రాఫిక్ నరకం
KPHB పరిసర ప్రాంతాల్లో రోడ్లపై ఇరువైపులా కమర్షియల్ యాక్టివిటీస్ పెరిగిపోవడం, రోడ్లనే పార్కింగ్ స్థలాలుగా మార్చుకోవడంతో అత్యవసర వాహనాలు వెళ్లడానికి కూడా దారి లేని పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
నిర్ణయం ప్రజల చేతుల్లోనే…
“ప్రజల ఓట్లతో గెలిచిన కార్పొరేటర్ గానీ, పాలకులు గానీ ఈ సమస్యలపై స్పందించడం లేదు. అందుకే ప్రజలు ఇకనైనా మేల్కొని, తమ సమస్యల కోసం నిలబడే, బాధ్యతాయుతమైన నాయకులను ఎంచుకోవాలి” గాధే శివ విజ్ఞప్తి చేశారు.