Take a fresh look at your lifestyle.

పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ

  • రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.
  • వెయ్యి అదనపు ఇందిరమ్మ ఇండ్లు బఫర్ జాబితా కింద లబ్ధిదారులను ఎంపిక చేయాలి.
  • జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు.

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా పేదలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు,   కరీంనగర్ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావులతో కలిసి పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఎలిగేడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నూతన పోలీసు స్టేషన్ కార్యాలయం, సమీకృత కలెక్టరేట్ వద్ద నూతన ట్రాఫిక్, రూరల్ పోలీస్ స్టేషన్లు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద మహిళా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు. పెద్దపల్లి పట్టణంలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చందపల్లి రాంపల్లి గ్రామంలో నిర్మించిన 466 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చందన్ పల్లి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.ప్రజలతో సత్సంబంధాలు ఉంటూ సంక్షేమం కోసం కృషి చేసే నాయకుడు పెద్దపెల్లి ఎమ్మెల్యే అని కితాబు ఇచ్చారు. సన్న బియ్యంలో పురుగులు ఉన్నాయని కొందరు రాజకీయాల కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు అటువంటివారిని ఇసడించుకుంటున్నారని పేర్కొన్నారు. గత పాలకుల హయాంలో పేదల కోసం ఇల్లు నిర్మించకుండా, వారు మాత్రం పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 22 వేల 500 కోట్లతో మొదటి విడతలో 4 లక్షల 50 వేల ఇండ్లు మంజూరు చేసిందని, రాబోయే మూడేళ్లలో మొత్తం 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రాబోయే మూడేళ్లలో మరో మూడు విడతలుగా ఇండ్లు ఇస్తామన్నారు.  కక్ష సాధింపు చర్యలకు తమ ప్రభుత్వం దూరంగా ఉంటుందని గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారుల పేర్లు మార్చకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మౌలిక వసతులు కల్పించి అందిస్తున్నామన్నారు.గత పాలకులు తీసుకుని వచ్చిన ధరణి చట్టం వల్ల కేవలం పాలకుల కుటుంబ సభ్యులు మాత్రమే లబ్ది పొందారని, అనేక మంది రైతులకు కన్నీళ్లు మిగిల్చిన ధరణి చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసి భూ సమస్యల పరిష్కారానికి అద్భుతమైన భూ భారతి  చట్టం ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి అధికారులు వచ్చి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని, ప్రజల నుంచి భూ సమస్యల గురించి దరఖాస్తులు తీసుకొని క్షేత్రస్థాయిలోనే వాటిని పరిష్కరిస్తారని అన్నారు. రైతన్నలకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, సన్న వడ్లకు ప్రభుత్వం 500 రూపాయల బోనస్ అందిస్తుందని, గతం కంటే ఎక్కువగా పెట్టుబడి సహాయం రైతు భరోసా క్రింద ఎకరానికి రూ. 12 వేలు అందిస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో నిర్మాణం ప్రారంభించి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు అందించాలని, బ్యాలెన్స్ పనులు మౌలిక వస్తువుల కల్పనకు అవసరమైన నిధులను మంజూరు చేసి వాటిని పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో ఇందిరమ్మ  ఇండ్ల పథకం  వెయ్యి ఇండ్లు బఫర్ క్రింద అదనంగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని మంత్రి, కలెక్టర్ కు సూచించారు.

మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు  మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. టెయిల్ఎండ్ ప్రాంతాలకు సాగునీరు అందుతుందంటే పెద్దపల్లి ఎమ్మెల్యే కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేసి పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామన్నారు.అర్హత ఉండి ఇండ్లు రానివారు ఎవరు ఆందోళన చెందవద్దని, రాబోయే దశలలో మరిన్ని ఇండ్లు మంజూరు అవుతాయన్నారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఓదెల, శ్రీరాంపూర్తో పాటు రామగుండం పట్టణంలో కూడా 650 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మౌలిక వసతుల కల్పన పనులు జరుగుతున్నాయని మరో రెండు నెలలలో పూర్తి చేసి పంపిణీ చేస్తామని తెలిపారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ రూ.4.5 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు.  గతంలో ఎన్నికల ముందు హడావుడిగా పూర్తికాని ఇండ్లకు మౌలిక సదుపాయాలు లేకుండానే లబ్ధిదారులను ఎంపిక చేశారని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత  అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులు కల్పించి 466 ఇండ్లు పంపిణీ చేస్తున్నమన్నారు.  రూ.82 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లు పూర్తయ్యాయని, రూ.52 కోట్లతో 100  పడకల ఆసుపత్రి భవనం నిర్మిస్తున్నామని, ఇప్పటివరకు 34 పిల్లర్ల పని జరిగిందన్నారు. పెద్దపల్లి బస్ డిపో కల ప్రజా ప్రభుత్వం సాకారం చేసిందని, రాబోయే సంక్రాంతి నాటికి బస్ డిపో పూర్తవుతుందన్నారు.నేడు ప్రభుత్వ ఆసుపత్రులలో గణనీయంగా ప్రసవాలు జర్గుతున్నాయని, శిశువులకు ఉండే ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం డి.ఈ.ఐ.సి ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 20 మంది చిన్నారులకు చికిత్స అందించాలని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల కంటే మెరుగ్గా ప్రభుత్వ ఆసుపత్రి పని చేస్తుందన్నారు.

రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండంలో మరో  తహసిల్దార్ కార్యాలయం అవసరం ఉందని , వెంటనే మంజూరు చేయాలని కోరారు. 650 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మరమ్మతు, మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగవంతం చేయాలని, 150 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పిల్లర్ల దశలో ఉన్నాయని వాటిని కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్, డిసిపి కరుణాకర్, అదనపు కలెక్టర్లు డి.వేణు, జే.అరుణశ్రీ, రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ , ప్రజా ప్రతినిదులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.