ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం
సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన
అభివృద్ది సంక్షేమ కార్యాక్రమాలను వేగవంతంగా ప్రజల్లోకి చేర్చండి
ఆధునీకరించిన ఐఅండ్ పిఆర్ వెబ్‌సైట్ ను ప్రారంభించిన
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఏ మార్పు కావాలని తెలంగాణ ప్రజలు ప్రజాప్రభుత్వంపై విశ్వాసం ఉంచారో రెండేళ్లలోనే ఆ మార్పు స్పష్టంగా చూపించి ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి అన్ని రంగాలలోనూ మరీ ముఖ్యంగా ఆర్ధికరంగంలో పెను సంక్షోభం ఉందన్నారు. ఒక్కోమెట్టు పేర్చుకుంటూ సంక్షోభం నుంచి గట్టెక్కుతూ అభివృద్ది, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలలో స్పష్టమైన మార్పునకు నాంది పలుకుతున్నాయని అన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఉపాధి కల్పన వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలుపుతున్నాయన్నారు. ఈ మార్పులను ప్రజలకు సమర్ధవంతంగా చేరవేయడంలో ప్రజా సంబంధాల శాఖ పాత్ర అత్యంత కీలకం. ప్రస్తుత పరిస్ధితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకొని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పధకాలను ఎప్పటికప్పుడు వేగవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సమాచార శాఖ అధికారులకు సూచించారు. సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆధునీకరించిన సమాచార పౌరసంబంధాల శాఖ వెబ్‌సైట్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ పాలనను రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగుపెట్టామన్నారు. రెండేళ్ల కాలం మరీ తక్కువే కానీ ప్రభుత్వం సాధించిన విజయాలు మాత్రం అత్యద్భుతమన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వకపోయినా ప్రజల సంక్షేమం కోసం పలు పధకాలను అమలు చేశామన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నామన్నారు. ఆర్ధికవృద్దిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్ధానంలో నిలిచిందనీ తెలంగాణను భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు త్తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలను నిర్ధేశించుకొని మరోవైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ, ద్విముఖ వ్యూహంతో మా ప్రభుత్వం పాలన సాగిస్తున్నామన్నారు. పాలనలో పారదర్శకత, అభివృద్దిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను రెండేళ్లలో దేశానికి రోల్‌మోడల్‌గా నిలబెట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఅండ్ పిఆర్ కమీషనర్ సిహెచ్. ప్రియాంక, సీఎం సీపీఆర్‌వో జి. మల్సూర్, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ డిఎస్ జగన్ , జాయింట్ డైరెక్టర్ రమణ పాల్గొన్నారు.