విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి : టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు.
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్య విజయోత్సవం 2025-26 విద్యా సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ముందుగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులకు పదవ తరగతి అనేది జీవితంలో ఎదిగేందుకు మొదటి మెట్టు అయినందున ఇంతటితో విద్యార్థులు తమ కష్టాన్ని ఆపకుండా ఇంకా కష్టపడి జీవితంలో చదివితే భవిష్యత్తులో ఒక గౌరవప్రదం పొందే అవకాశం విద్యార్థులకు కలుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి మంచి విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. జిల్లాలో ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన ఉత్తీర్ణత ఫలితాలు రికార్డు స్థాయిలో జిల్లా, మండల స్థాయిలో సాధించినందుకు విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలు అధికంగా జిల్లాలో 98.30% శాతం ఉత్తీర్ణత సాధించిందన్నారు. ప్రైవేట్ పాఠశాలలో 500 పై బడినవారు తక్కువ సంఖ్యలో ఉన్నారని అదే ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థుల సంఖ్య ప్రైవేటు పాఠశాలలు కంటే ఎక్కువ మంది విద్యార్థులు అధికంగా సాధించారన్నారు. ప్రభుత్వం రానున్న రోజుల్లో విద్యారంగం మార్పు కొరకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టనుందన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య కారణమైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పదవ తరగతి, ఇంటర్మీడియట్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 9 మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.10 వేల క్యాష్ అవార్డులు అందించి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి, టీజీవో అధ్యక్షులు మందడి ఉపేందర్ రెడ్డి, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.