ముద్ర, తెలంగాణ బ్యూరో :
కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయ్యి లభించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 8మంది బీజేపీ ఎంపీలు, మంత్రులు ఉన్నప్పకీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ దేశాభివృద్ది, రాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం ఉపయోగపడేలా లేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత బడ్జెట్ తో కేంద్ర ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పులు, వడ్డీలు కట్టాల్సి వస్తున్నదని తెలిపారు. పని దినాలు పెంచామని చెప్పినప్పటికీ ‘విబి జిరాంజి’ పథకానికి కేవలం రూ.93 వేల కోట్లు కేటాయించి గతంతో పోలిస్తే కోత పెట్టారని విమర్శించారు. వ్యవసాయ రంగానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమానికి నిధులు తగ్గించారని, ఈ రంగాలకు గతంలో కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు చేయలేదన్నారు. దేశ కార్పొరేట్ సంస్థలైన ఆదానీ, అంబానీ తదితరులకు డేటా సెంటర్ల పేరుతో రాయితీలు ప్రకటించారని, సంక్షేమ పథకాలు, ఎరువుల రాయితీలు, చిన్న పరిశ్రమలకు ఎలాంటి రాయితీలు ప్రకటించలేదు. ఉద్యోగులకు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచకుండా నిరాశపర్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి వాటాగా రావాల్సిన నిధులు తగ్గించారని, పన్నుల వాటాలో 2.11 శాతం ప్రకారం రూ.63 వేల కోట్లు రావాల్సిందని, గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రూ.4 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. జీఎస్టీ పన్నుల వల్ల ఇప్పటికే రాష్ట్రాలు ఆర్ధికంగా సతమతమవుతుంటే పన్నుల వాటాను తగ్గించడం శోచనీయమన్నారు. పాలమూరు, రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా యివ్వాలని కోరుతున్నా వాటి ఊసే లేదన్నారు. హైదరాబాదు మెట్రో రైల్‌ను విస్తరణకు నిధులు ఇవ్వలేదని, ఫార్మా రంగానికి అవసరమైన నిధులు కేటాయించలేదని, విద్యా, వైద్య రంగాలు పూర్తిగా కార్పొరేట్ మయమవుతున్న పరిస్థితుల్లో పేదలకు ఆ రంగాలు అందుబాటులోకి తేవడానికి తగినన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన లేదని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఈ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేవని తెలిపారు.