Take a fresh look at your lifestyle.

తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనీయం

  • బ్రిటిషర్ల కంటే బీజేపీ నేతలే ప్రమాదకరం.
  • మోదీకి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి.
  • వచ్చే రోజుల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యం.
  • మణిపూర్​లో మంటలు రాజేసింది మోదీనే.
  • ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి.
  • తెలంగాణలో కుల గణన చేసి చూపించాం.
  • అహ్మదాబాద్​ సీడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్​రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో బీజేపీని ఎట్టిపరిస్థితుల్లోనూ అడుగుపెట్టనివ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, ఇప్పటికే మణిపూర్​లో మంటలు రాజేశారని మండిపడ్డారు. బ్రిటిషనర్ల కంటే బీజేపీ నేతలు చాలా ప్రమాదమని ఫైరయ్యారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా ఏఐసీసీ ప్లీనరీ సమావేశంరెండో రోజు ప్రసగించిన సీఎం రేవంత్, బీజేపీ, ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి, దేశాన్ని విభజించాలని ప్రధాని మోదీ చూస్తున్నారని విమర్శించారు.దేశానికి బీజేపీ ప్రమాదకరంగా మారుతోందన్నారు.

  • మా తెలంగాణే స్పూర్తి.

తెలంగాణలో కులగణన చేసి తమ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. దేశమంతా కులగణన చేయాలని, జనగణనతో పాటు కులగణన చేసే దమ్ము కేంద్రానికి ఉందా అని నిలదీశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రైతులకు రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు. మోడీ, బీజేపీ నేతలు గాడ్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారని, గాంధీ విధానాలకు వ్యతిరేకంగా మోదీ పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వమని అన్నారు.గతంలో బ్రిటీష్ వాళ్లను దేశం నుంచి తరిమి కొట్టినట్లే బీజేపీని సైతం తరిమి కొట్టాలని, బ్రిటిషనర్ల కంటే బీజేపీ నేతలు చాలా ప్రమాదమని,అలాంటి వారిని తరమికొట్టాల్సిందేనని పిలుపునిచ్చారు.ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని, దేశంలోని గాంధేయవాదులంతా ఏకమై బీజేపీ పని పట్టాలని, రానున్న రోజుల్లో బీజేపీని ఓడించే బాధ్యతను ప్రతి కాంగ్రెస్​ కార్యకర్త, గాంధీ వారసులు అహ్మదాబాద్​ వేదికగా ప్రతినబూనాలన్నారు.బీజేపీ ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమని, ఎంత త్వరగా తరిమిస్తే అంత మంచిదని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.మొత్తం మోదీ అంతా గాడ్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు.నిజాం సర్కార్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అని గుర్తు చేసుకున్నారు.వ‌ల్లభాయ్ ప‌టేల్ నడయాడిన భూమి నుంచి తాను ఒక్కటే చెబుతున్నానని, సోనియా గాంధీ నాయకత్వంలో తాము బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని, బీజేపీని అడ్డుకుంటామని సభా వేదికపై హామీ ఇచ్చారు. గాంధీజీ బ్రిటిష్ పాల‌న‌కు వ్యతిరేకంగా దండి స‌త్యాగ్రహంతో పాటు 30 ఏళ్ల పాటు అనేక పోరాటాలు చేశారని, కానీ బ్రిటిష్‌వాళ్లు ఎప్పుడూ గాంధీజీ మీద లాఠీ ప్రయోగం చేయలేదన్నారు.స్వాతంత్య్రం వ‌చ్చిన ఆరు నెలల్లోనే గాడ్సే వార‌సులు గాంధీజీపై తుటా పేల్చి ఆయ‌న‌ను హ‌త్య చేశారని గుర్తు చేశారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడేందుకు మ‌న‌మంతా సిద్దంగా ఉండాలని, తెలంగాణ‌లో బీజేపీని అడ్డుకునేందుకు, ఓడించేందుకు తామంతా ఇక్కడి నుంచి ఆశ‌ను, ఆదేశాన్ని తీసుకొని వెళుతున్నామని రేవంత్​ రెడ్డి చెప్పారు.

  • ఉద్యోగాలేమయ్యాయి..?

దేశంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ ఇచ్చిన హామీ ఏమైందని సీఎం రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని మోదీకి, అమిత్ షా కి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, అంతేతప్ప నిరుద్యోగ యువతకు రాలేదన్నారు. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారని, పదకొండు సంవ‌త్సరాలు దాటిపోయిందని, ఈ లెక్కన 20 కోట్లకు పైగా ఉద్యోగాలు ఇవ్వాలని, కానీ, ఇంకా నిరుద్యోగులు పెరుగుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మణిపూర్​లో మంట పెట్టిందే మోదీ పార్లమెంట్​లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లోక్ సభలో మైక్ ఇవ్వకపోవడాన్ని రేవంత్ నిలదీశారు. మోదీ వైఫల్యాలను ఎండగడతారన్న ఉద్దేశంతోనే ఆయనకు మైక్ ఇవ్వడం లేదని,దేశంలో మోదీ పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.మోదీ పాలనకు మణిపూర్ సంక్షోభమే సాక్ష్యమని స్పష్టం చేశారు.మణిపూర్​లో మంటలు రేపి..రచ్చ చేసి నిప్పు పెట్టిందే మోదీ అని విమర్శించారు.మోదీ మణిపూర్‌లో మంట‌లు రాజేయడంతో దేశంలో శాంతి ఉందా లేదా అని అనుమానాలు వచ్చాయని, దేశ మూల వాసుల జీవ‌న హ‌క్కును కాల‌రాసే ప్రయ‌త్నం మోదీ చేస్తున్నారని మండిపడ్డారు.ప్రధానిని నమ్మి అధికారం కట్టబెడితే రైతులకు అన్యాయం చేశారని, మూడు రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి రైతులను వంచించారన్నారు.రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్రను నిర్వహించారని,ఈ సందర్భంగా, మహిళలు, యువతుకు పలు హామీలు ఇచ్చామన్నారు.వాటన్నింటినీ నెరవేస్తున్నామని తెలిపారు.తెలంగాణలో ఇచ్చిన హామీలపై రాహుల్​గాంధీకి స్పష్టత ఉందని, రాహుల్ గాంధీ కూడా తన ప్రసంగంలో తెలంగాణలో కులగణన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారని, కులగణన తెలంగాణలో పక్కాగా పూర్తి చేశామని, 90 శాతం ఓబీసీలు, దళితులు, మైనార్టీలే ఉన్నారన్నారు. కులగణనకు ఆరెస్సెస్, బీజేపీ వ్యతిరకమని సీఎం రేవంత్​రెడ్డి ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.