Take a fresh look at your lifestyle.

మత్తు పదార్థాల నిర్మూలనకు కలిసికట్టుగా కృషి. మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నట్లు సమాచారం ఇచ్చే పౌరులకు రూ.10 వేల నగదు బహుమతి

 

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:

జిల్లాలో మత్తుపదార్థాల వినియోగాన్ని నిర్మూలించేందుకు సంబంధించి శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మత్తు పదార్థాల నివారణ పై నిర్వహించే నార్కోటిక్స్ మీటింగ్ లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. విద్యా సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల నివారణపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్, అంగన్వాడి కేంద్రాల్లో, మహిళా సంఘాల సమావేశాల్లో కూడా డ్రగ్స్ వలన కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కలిగేలా వివరించాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నట్లు సమాచారం ఇచ్చే పౌరులకు రూ.10 వేల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించాలన్నారు. అటవీ శాఖ అధికారులు కూడా ఎవరైనా, ఎక్కడైనా గంజాయి మొక్కలు పెంచుతుంటే నిఘా ఉంచి నిర్మూలించాలన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ నివారణపై పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో డీఈవో విజయలక్ష్మి , డిడబ్ల్యుఓ సునంద, ఇంటర్మీడియట్ అధికారి హృదయ రాజు, ఎక్సైజ్ అధికారి సైదిరెడ్డి, డ్రగ్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్, అటవీ, రెవెన్యూ, వైద్య, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.