- న్యాయమూర్తులు, న్యాయవాదులు సంతాపం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ హైకోర్టు జడ్జి గిరిజా ప్రియదర్శిని కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం ఉదయం 10.15 గంటలకు తుది శ్వాస విడిచారు.సోమవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహిస్తామని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.జస్టిస్ గిరిజా ప్రియదర్శిని మృతిపట్ల పలువురు హైకోర్టు సీజే సహా పలువురు న్యాయమూర్తులు, హైకోర్టు సిబ్బంది సంతాపం తెలిపారు.విధి నిర్వహణలో నిక్కచ్ఛిగా ఉండేవారని, కేసులను లోతుగా పరిశీలించి న్యాయమైన తీర్పులు వెలువరించేవారని పలువురు న్యాయవాదులు ఆమె సేవలను కొనియాడారు. ఆమె మరణం న్యాయవ్యవస్థకు తీరనిలోటు అనే వారు ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్ మాటురి గిరిజా ప్రియదర్శిని ఆగస్టు 30న విశాఖపట్నంలో జన్మించారు. జస్టిస్ ప్రియదర్శిని తండ్రి మాటురి అప్పారావు తెలంగాణ ప్రాంతంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా పనిచేశారు.తల్లి నాగారత్నం గృహిణి. ఇంటర్మీడియట్ పూర్తికాగానే ఆమె డాక్టర్ కె. విజయ్ కుమార్‌తో వివాహం చేసుకున్నారు.వారికి నిఖిల్, అఖిల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వివాహమైన తర్వాత కూడా జస్టిస్ మాటురి గిరిజా ప్రియదర్శిని తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీలు పొందారు. అనంతరం, 1995లో విశాఖపట్నంలోని ఎన్.బి.ఎం లా కాలేజీ నుంచి మూడేళ్ల న్యాయశాస్త్ర పట్టా అందుకున్నారు. 1997లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి లేబర్ అండ్ ఇండస్ట్రీయల్ లా లో ఎల్.ఎల్.ఎం పూర్తి చేశారు. ఆమె రాజ్యాంగ చట్టంలో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. సెప్టెంబర్ 1995లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. న్యాయవాదిగా చేరిన తర్వాత పి. ఉమాబాల కార్యాలయంలో దాదాపు 7 సంవత్సరాలు పనిచేశారు. విశాఖపట్నంలో 10 సంవత్సరాలకు పైగా క్రియాశీల న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. సివిల్, క్రిమినల్, కార్మిక చట్టం, వైవాహిక సంబంధిత కేసులతో పాటు విశాఖపట్నం జిల్లా న్యాయ సేవల సంస్థ ద్వారా సూచించబడిన ఉచిత న్యాయ సహాయ కేసులను కూడా ఆమె వాదించారు. ఆ తర్వాత ప్రత్యక్ష నియామకం ద్వారా జిల్లా జడ్జిగా ఎంపికై 2008 నవంబర్ 3న అదనపు జిల్లా జడ్జిగా న్యాయశాఖలో చేరారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. ఆగస్టు 2016 నుంచి డిసెంబర్ 2018 వరకు ఒంగోలు ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా, జనవరి 2019 నుంచి అక్టోబర్ 2020 వరకు ఆదిలాబాద్ ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా, అక్టోబర్ 2020 నుంచి మార్చి 2022 వరకు కరీంనగర్ ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఆమె 2022 మార్చి 24న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా పనిచేసిన సమయంలో.. ప్రకాశం, ఆదిలాబాద్ జిల్లాల న్యాయ సేవల సంస్థలు 2016-2019 మధ్య వరుసగా మూడుసార్లు జాతీయ న్యాయ సేవల సంస్థ చే ఉత్తమ జిల్లా న్యాయ సేవల సంస్థగా గుర్తింపు పొందాయి.
