ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : గణిత విజ్ఞానంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని సాధించి దేశంలోనే వికారాబాద్ పట్టణానికి చెందిన వేదిక్ పాఠశాల విద్యార్ధి విహాన్ రెడ్డి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే వికారాబాద్‌లోని వేదిక్ ఉన్నత పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థి విహాన్ రెడ్డి ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ నిర్వహించిన గణిత ఒలింపియాడ్‌లో జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి నేషనల్ టాపర్ గా నిలిచాడు.

దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. విహాన్ రెడ్డి తన కృషి, పట్టుదలతో గణితంలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి జాతీయ స్థాయి మొదటి స్థానాన్ని సాధించి బహుమతి అందుకున్నాడు. ఈ సందర్బంగా వేదిక్ ఉన్నత పాఠశాల కరెస్పాండంట్ విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ విహాన్ రెడ్డి జాతీయ స్థాయి గణిత కాంపిటేషన్ లో పాల్గొని విజయం సాధించడం మా విద్యాసంస్థకు ఎంతో గర్వకారణమన్నారు.
ఈ గొప్ప విజయంతో వేదిక్ ఉన్నత పాఠశాల మరోసారి విద్యా రంగంలో తన ప్రతిష్టను చాటుకుందన్నారు. విద్యార్థి విహాన్ రెడ్డిని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి వారికి సరైన మార్గదర్శనం చేయడం మా సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. విహాన్ రెడ్డి సాధించిన ఈ విజయం తోటి విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.
ఈ విజయం పాఠశాల పేరు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా మరింత గౌరవాన్ని తెచ్చిందన్నారు.