అర్హులైన ప్రతి బీద వాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ద్యేయం – తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి
ముద్ర, తాండూర్:
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రోజున హైదరాబాద్ రోడ్డు మార్గంలో పట్టణ శివారులో నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నామని, అందులో భాగంగానే పట్టణ శివార్లలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించడం జరిగిందని, ఇప్పటివరకు దాదాపుగా 3 వేలకు పైగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుందని, అందులో చాలావరకు గృహప్రవేశాలు కూడా జరిగాయని, రాబోయే రెండు నెలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జాబితాను సిద్ధం చేసి, అర్హులైన ప్రతి బీదవాడికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.