Take a fresh look at your lifestyle.

మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహన శేవలో ఊరేగిన భక్తవత్సలుడు..

తిరువీధులలో అంగరంగ వైభవంగా దివ్య విమాన రథోత్సవం..
ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలలో గురువారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీ స్వామివారిని శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహన శేవలో అలంకరించి భక్తుల దర్శనార్ధం తిరువీధులలో ఊరేగింపు వేడుక నిర్వహించారు. ఈ వేడుకలను శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారముగా ఆలయప్రధానార్చకులు, ఉపప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, వేదపండితులు, అర్చకబృందం, పారాయణీకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కార్యనిర్వహణాధికారి జె. భవానీశంకర్, ఆలయ అనువంశికధర్మకర్త బి.నరసింహామూర్తి, జిల్లా కలెక్టర్ ఎమ్. హనుమంతరావు,ఇరిగేషన్ కమీషనర్ శివకుమార్ నాయుడు, ఉపకార్యనిర్వహణాధికారి, సహాయకార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకొని తరించారు.

శ్రీ మహావిష్ణువు అలంకారము, గరుడ వాహన శేవ ప్రత్యేకత

వైకుంఠవాసి శ్రీమహావిష్ణువు శ్రియః పతి శ్రీమన్నారాయణుడు భక్త రక్షణార్ధము యోగ నిద్రలో జగత్తును రక్షణ గావించుట వేద ప్రసిద్ధమై ఉన్నది. శ్రీ మహావిష్ణువు అనంత కళ్యాణ గుణములను లెక్కింపనెవరికి సాధ్యపడదు. ” విష్ణుం సదాహం శరణం ప్రపద్యే” అనే శరణాగతి దైవము శ్రీ మహా విష్ణువేనని సకల పురాణములు వేదములు పేర్కొనుచున్నవి. మహావిష్ణువు శబ్దమునకు అంతటా వ్యాపించి రక్షించువాడు అని అర్ధము. లోక కంఠకులైన దానవులను సంహరించుటలో శ్రీ మహా విష్ణువే అంతర్లీనముగా ఉండి అనుగ్రహించునని పురాణములు ఇతిహాసములు తెలియజేయుచున్నవి. భగవానుడి వాహనము గరుడాళ్వార్ (గరుత్మంతుడు) వేద స్వరూపముని గరుడ వాహనములో భగవానుడు (వేంచేయుట ఒక ప్రత్యేకత. “వాహన” శబ్దమునకు మోయుట అని అర్ధము. భగవానుడిని మన వరకు తీసుకువచ్చి చూపించే గొప్ప తత్త్వ గరుడ వాహన సేవలో కలదు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై దర్శనం ఇచ్చుట ఎంతో విశిష్టతను సంతరించుకొనినది.

సాయంకాల దివ్య విమాన రథోత్సవ వేడుకలు

సాయంకాలం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరము చతుస్థానార్చనలు, మూలమంత్ర జపములు, మండపారాధనలు, ద్వార తోరణ పూజలు, దివ్య ప్రబంధ పారాయణాదులు నిర్వహించెదరు. అనంతరము దివ్య విమాన రథోత్సవ వేడుకలు శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారముగా నిర్వహించబడును. రథాంగహోమము, రథబలి నిర్వహించారు. శ్రీ స్వామివారి ఉత్సవమూర్తుల అలంకార సేవ రథంపై వేంచేపు చేసి భక్తుల దర్శనార్థము ఆలయ తిరువీధులలో అంగరంగ వైభవముగా ఆలయ ప్రధానార్చకులు, ఉపప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, వేదపండితులు, అర్చక బృందం, పారాయణీకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు.
శ్రీ స్వామివారి దివ్య విమాన రథోత్సవము ప్రత్యేకత

“ఆత్మానం రధీనం విద్ది, శరీరం రథమేవచ” అని భగవద్గీతలో రథోత్సవ విశిష్టతను తెలియజేయుచున్నది. రథము అనగా శరీరము అని, ఈ శరీరంలో భగవానుడు ప్రాణ రూపంలో ఉంటేనే అవయవములు కదలికను పొందగలవని వేదాంతర్ధమును తెలియజేయుచున్నది. “రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే ” అని రథారూఢుడైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించిన జన్మరాహిత్యం అని పురాణములు పేర్కొనుచున్నవి. బ్రహ్మోత్సవములలో శ్రీ స్వామి వారు వివిధ అలంకార సేవలలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తూ తిరువీధులలో దర్శన భాగ్యమును కలిగించి భక్తజన కోటికి మోక్షమును అందించుటకై రథారూఢుడై దర్శనమిచ్చుట ఎంతో విశేషమైయున్నది.

Leave A Reply

Your email address will not be published.