సంగారెడ్డి, ముద్ర ప్రతినిధి ఫిబ్రవరి 27:
సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సహకారంతో జాతీయ సేవా పథకం (NSS) మరియు మేరా యువ భారత్, సంగారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ మరియు జిల్లా యువజన అధికారి రంజిత్ రెడ్డి సంయుక్త ప్రకటనలో తెలిపారు.

యువతను దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం, సామాజిక సమస్యలపై యువతరంలో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఈ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించామని వారు తెలిపారు.
ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా “భారత ప్రజాస్వామ్యంపై ఎమర్జెన్సీ ప్రభావం” అనే అంశంపై యువత తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ, మానవ హక్కుల ప్రాముఖ్యతను వారు విశదీకరించారు.
సంగారెడ్డి జిల్లాలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తొలిసారిగా నిర్వహించడం గర్వకారణమని తెలిపారు.
జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్‌లో విజేతలైన ఐదుగురు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని, అక్కడ విజయం సాధించిన వారు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్‌లో పాల్గొనే అవకాశం పొందుతారని వివరించారు.
జిల్లా వ్యాప్తంగా 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతలో 400 మందికి పైగా నమోదు చేసుకోగా, అందులోంచి ఎంపికైన 62 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి జడ్జీలుగా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అఖిలేష్ రెడ్డి, లా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ శ్రీలత, యువజన అధికారి శశాంక్, కళాశాల ప్రొఫెసర్ పి. సుజాత వ్యవహరించారు.
కార్యక్రమంలో మై భారత్ సంగారెడ్డి అధికారి కిరణ్ కుమార్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నిర్మల, డాక్టర్ జగదీశ్వర్, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ సదయకుమార్, డాక్టర్ వాణి, డాక్టర్ జోష్నా, డాక్టర్ వల్లి సౌభాగ్యం, ఉమామహేశ్వరి, కళాశాల అధ్యాపక బృందం, అడ్మినిస్ట్రేటివ్ అధికారి కామరాజ్, జిల్లాలోని వివిధ కళాశాలల విద్యార్థులు మరియు యువత పాల్గొన్నారు.