భస్మాసుర ‘హస్తం’
తాండూరు ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
అరచేతిలో వైకుంఠం చూపి మోసం చేయడం కాంగ్రెస్ కు అలవాటు
ఇప్పుడూ మోసపోతే గోస పోతాం
ముద్ర, వికారాబాద్ :
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ది అభయహస్తం కాదని.. భస్మాసుర హస్తమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపిన హస్తం… అధికారంలో వచ్చాకా తన నిజ స్వరూపాన్ని చూపిందన్నారు. ఆరు గ్యారంటీలు, హామీల అమలుపై నిలదీస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడమన్న కేటీఆర్… 420 హామీలు అమలయ్యే దాకా ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. ఉద్యోగాల పేరుతో యువతను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలో వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే… మున్సిపల్ ఎన్నికల్లోనూ అలాంటి అబద్ధాలాడి అయినా గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని కేటీఆర్ విమర్శించారు. మొదటిసారి మోసం చేస్తే తప్పు ఎదుటి వారిదవుతుంది.. రెండోసారి మోసపోతే తప్పు మనది అవుతుందని ఓటర్లను అప్రమత్తం చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసిందన్నారు. అధికారంలో వచ్చిన వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని ప్రగల్భాలు పలికి మళ్లీ మోసం చేసిందని ఆరోపించారు. రేవంత్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదని అన్నారు. చెప్పులు క్యూలైన్లలో పెట్టి ఎదురు చూడాల్సిన దుస్థితి దాపురించిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎప్పుడూ యూరియా కొరత లేదని మండిపడ్డారు. రైతుబంధు అడిగితే.. లాగులో తొడలు విడుస్తానని అంటున్నాడని విమర్శించారు. రెండున్నరేళ్లుగా సంక్షేమాభివృద్ధి లేక ప్రజలు గోసపడుతున్నారని తెలిపారు. బతుకమ్మ చీర లేదు.. కేసీఆర్ కిట్ లేదని విమర్శించారు. ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని బోగస్ మాట చెప్పిండని మండిపడ్డారు. ఫిబ్రవరి 8వ తేదీకి కూడా రైతుబంధు పడలేదని తెలిపారు. వృద్ధులకు రూ.4వేల పింఛన్ ఇస్తామని మోసం చేశాడని అన్నారు. అత్తకు, కోడలికి ఇద్దరికీ రూ.2500 ఇచ్చిండా అని ప్రశ్నించారు. తులం బంగారం, రూ.4వేల పింఛన్, విద్యా భరోసా, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2500, స్కూటీలు ఇస్తామని అనేక హామీలు ఇచ్చిండని అన్నారు.