“ఒక్కో వృద్ధుడికి రూ.52వేలు కాంగ్రెస్ బాకీ – ఓట్ల కోసం వచ్చే ఆ పార్టీ లీడర్లను నిలదీయండి: సదాశివపేటలో అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు
ఒక్కో వృద్ధుడికి రూ.52వేలు కాంగ్రెస్ బాకీ
ఓట్ల కోసం వచ్చే ఆ పార్టీ లీడర్లను నిలదీయండి
మేం అన్నం పెడితే.. కాంగ్రెస్ మీకు సున్నం రాస్తుంది
సదాశివపేటలో అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు
ముద్ర, సదాశివపేట :
తాము అధికారంలో వస్తే రూ. 2వేలు ఉన్న ఆసరా పెన్షన్ ను రూ.4వేలకు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్రంలో వృద్ధులకు ఒక్కొక్కరికీ రూ.52వేలు బాకీ పడిందని అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వస్తున్న కాంగ్రెస్ లీడర్లకు తమకు రావల్సిన బాకీ డబ్బులు రూ.52 వేలు ఇవ్వాలని నిలదీయాలని అవ్వాతాతలకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మెదక్ జిల్లా సదాశివపేటలో పర్యటించి.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అన్నం పెట్టే కార్యక్రమాలు చేపడితే… ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు సున్నం పూస్తోందని విమర్శించారు. అన్నం పెట్టినోళ్లకు ఓటేస్తారో, సున్నం పూసినోళ్లకు ఓటేస్తారో..? తేల్చుకోవాలని ఓటర్లకు సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. ఏ ఒక్కరినీ వదలకుండా అన్ని వర్గాలనూ మోసం చేసిండని మండిపడ్డారు. బూతుల ముఖ్యమంత్రికి ఓటుతో గట్టి బుద్ధి చెప్పాలని సూచించారు. చెత్త మాటలు వద్దు.. అభివృద్ధి కావాలంటూ ఓటుతో తెలియజెప్పాలన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులందరినీ గెలిపించుకోండని.. మీ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత నాది అని స్పష్టంచేశారు. సదాశివపేటలో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని అనిపిస్తోందని హరీశ్ రావు అన్నారు. రెండున్నరేళ్లలో రేవంత్ సర్కార్ ప్రజలకు చేసిందేమీ లేదన్న ఆయన భార్యకు బస్సు ఫ్రీ ఇచ్చి.. భర్తకు డబుల్ టికెట్ ఇచ్చారన్నారు. రేవంత్ నోటి వెంట బూతులు తప్ప మంచిమాటలు రావడం లేదని మండిపడ్డారు. సదాశివపేట, సంగారెడ్డిలో మంచి ఆస్పత్రులు కట్టామని హరీశ్‌రావు తెలిపారు. బిడ్డ పుడితే రూ.13 వేలు ఇచ్చి అంబులెన్స్‌లో జాగ్రత్తగా ఇళ్ల వద్ద దించామని పేర్కొన్నారు. సదాశివపేటలో మంచినీటి కష్టాలు తీర్చింది కేసీఆర్ అని తెలిపారు. కల్యాణలక్ష్మీ కింద ఆడబిడ్డల పెళ్లి రూ.లక్ష ఇచ్చామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తానని చెప్పిండని.. ఇంతవరకూ ఇచ్చిండా అని ప్రశ్నించారు. ఏ ఒక్కరికైనా తులం బంగారం వచ్చిందా అని నిలదీశారు. సదాశివపేటలో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని అనిపిస్తోందని హరీశ్ రావు అన్నారు. భార్యకు బస్సు ఫ్రీ ఇచ్చి.. భర్తకు డబుల్ టికెట్ ఇచ్చారన్నారు. రేవంత్ నోటి వెంట బూతులు తప్ప మంచిమాటలు రావడం లేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక స్పెషల్ ప్యాకేజీ తెచ్చి పట్టణాలను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. బస్తీ దవాఖానాలు, వీధిలైట్లు, రోడ్లు, పార్కులు ఏర్పాటు చేశామని తెలిపారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల స్మశానవాటికలకు రూ.5 ఎకరాల చొప్పున ఇచ్చామని పేర్కొన్నారు. పట్టణాల్లో చెత్త ఎత్తని సీఎం, చెత్త మాటలు మాట్లాడుతుండని మండిపడ్డారు. లాగుల తొండలు వదులుతా.. పేగులు తీసి మెడలో వేసుకుంట.. గుడ్లు పీకి గోటీలాడుతా అని అంటున్నారని తెలిపారు.