Take a fresh look at your lifestyle.

ఏఐసీసీకి ఏటీఎంలా తెలంగాణ-జాగృతి అధ్యక్షురాలు కవిత

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడ్నుంచే డబ్బులు
రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు పంపుతున్నరు
హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి వసూళ్లు
తెలంగాణ వచ్చినా ఢిల్లీకి గులాంగిరి ఆగలేదు
ఈ నెల 25 తెలంగాణ భవిష్యత్, చరిత్ర ను మార్చే రోజు

ముద్ర, తెలంగాణ బ్యూరో:

తెలంగాణ కాంగ్రెస్ కు ఏటీఎంగా మారిందని జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా సరే వాటి ఖర్చు కోసం ఆ పార్టీ అధిష్టానం తెలంగాణపై ఆధారపడుతోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు ఢిల్లీకి డబ్బులతో ఉన్న సంచులు మోస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి గులాంగిరి చేస్తూ తన కుర్చీని కాపాడుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగాలంటే అది చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. అందుకే హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులను, ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నడిగడ్డ (గద్వాల) హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ తో పాటు ఆ జిల్లాకు చెందిన వెయ్యి మంది ఆయన అనుచరులు బుదవారం జాగృతిలో చేరారు. వారిని బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కండువా కప్పి ఆహ్వానించిన కవిత సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే స్వయంపాలన వస్తుందనుకుంటే ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేసే నేతలు వచ్చారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఫోన్ చేస్తే ఫోన్ లో మాట్లాడేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి నిలబడే మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. లేదంటే భట్టి విక్రమార్క వెళ్లి రాహుల్ కు ఫిర్యాదు చేస్తే తన సీటుకే ఎసరు వస్తుందని భయపడుతున్నారన్నారు. రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా, రుణమాఫీ సగం కూడా చేయకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కానీ తెలంగాణలో అన్ని చేశామంటూ పచ్చి అబద్దాలు చెప్పుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి కేరళకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తుండటం సిగ్గుచేటన్నారు. అప్పర్ భద్రకు కేంద్రం జాతీయ హోదా ఇస్తే రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ హోదా కారణంగా తుంగభద్రకు నీళ్లు రాక నష్టపోయేది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాయేనని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. అయినా సీఎం ఎందుకు మోడీ ని ప్రశ్నించటం లేదని నిలదీశారు. మోడీ ఏం చేసిన సరే రేవంత్ రెడ్డి మాట్టాడడం లేదని విమర్శించారు. అటు కాంగ్రెస్ ను, ఇటు బీజేపీని ఇద్దరూ మేనేజ్ చేస్తోన్న సీఎం.. ప్రజలను మాత్రం మోసం చేస్తున్నారన్నారు.

ఈ నెల 25న తెలంగాణ చరిత్ర మర్చబోతున్నాం
ఈనెల 25న తాము ప్రకటించనున్న కొత్త పార్టీ.. తెలంగాణ భవిష్యత్, చరిత్ర ను మార్చే రోజుగా నిలుస్తుందని కవిత అన్నారు. ఆరోజు తాము ఏర్పాటు చేయబోయే పార్టీ ద్వారా ఈ గడ్డకు కొత్త నెత్తురును, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తుందన్నారు. తాము పెట్టబోయే పార్టీ ప్రజల కోసం కొత్త తరహా రాజకీయాలు చేస్తుందన్నారు. ప్రశ్నించటం, పోరాడటం, పరిష్కరించటం ఇదే తమ పంథా అన్నారు. రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు. ప్రజల సమస్యల గురించి ప్రశ్నించేది ఎవరు అంటే ప్రతినోట జాగృతి అనే మాట వస్తోందన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు కదులుతామన్నారు. పప్పన్నం తింటూ.. ప్రజల మధ్యలో ఉంటూ వారితోనే కలిసి పనిచేస్తామన్నారు. ప్రజల కోసం పాదయాత్ర చేస్తామని చెప్పారు. సామాన్యుల చేత, సామాన్యుల కొరకు, సామాన్యులే ఉండే రాజకీయం చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయి నిపుణులతో సమావేశమై ప్రజల కోసం అద్భుతమైన అజెండా రూపొందిస్తున్నామని తెలిపారు. ఈనెల 25న పార్టీ ప్రకటన సందర్భంగా తమ ఎజెండాను ప్రజల ముందు ఉంచుతామన్నారు. ఖమ్మం వెలుగుమట్లలో పోరాదినట్లే రానున్న మూడేళ్ల పాటు ఈ ప్రభుత్వంపై ప్రజల తరఫున పోరాటం చేస్తామన్నారు.

గద్వాల్ గడీలో ఉద్యమకారుల జెండా ఎగరాలి
నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్ ఎంతో కమిట్ మెంట్ ఉన్న వ్యక్తి అని కవిత అన్నారు. అందుకే ప్రజల కోసం పోరాటం చేసేందుకు జాగృతి పెట్టబోయే పార్టీలోకి ఆయనను ఆహ్వానించామన్నారు. గద్వాల్ జిల్లాలో 70 ఏళ్లుగా గడీల కుటుంబాల కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. గద్వాల్ గడీలో టేకేదార్లు పోయి ఉద్యమకారుల జెండా ఎగరాలన్నారు. అక్కడి చేనేత, సీడ్ పత్తి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జాగృతి తరఫున సింహం గుర్తుతో పోటీ చేస్తే మొదటి విజయాన్ని ఇచ్చింది గద్వాల్ జిల్లానేనని కవిత గుర్తు చేశారు. రంజిత్ తో పాటు ఆయన అనుచరులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత తనదేనని వారికి హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.