Take a fresh look at your lifestyle.

వసంత పంచమి వేడుకలకు ముస్తాబైన శ్రీ మహాశక్తి దేవాలయం

  • చదువుల తల్లిగా, జ్ఞాన దేవతగా ప్రసిద్ధికెక్కిన శ్రీ మహాసరస్వతి అమ్మవారు.
  • చిన్నారుల అక్షరాభ్యాసానికి, పుస్తక పూజలకు శ్రీమహాశక్తి దేవాలయంలో ఏర్పాట్లు పూర్తి.

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ పట్టణం చైతన్యపురిలోని మహిమాన్విత శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల దివ్య క్షేత్రం వసంత పంచమి వేడుకలకు ముస్తాబైంది. చదువుల తల్లిగా, జ్ఞాన దేవతగా ప్రసిద్ధికెక్కి , చిన్నారుల అక్షరాభ్యాసానికి కొంగుబంగారంగా మారిన ఇక్కడి శ్రీ మహాసరస్వతి అమ్మవారి కోవెలలో వసంత పంచమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాటు చేశారు. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి వారి ఆశీస్సులతో ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం రోజున వసంత పంచమి సందర్భంగా శ్రీ మహాశక్తి దేవాలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు.

కార్యక్రమముల వివరములు:

ఉదయం 4 గంటలకు శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల మూల మూర్తులకు అభిషేకం,
▪ఉదయం 7 గంటలకు శ్రీ మహాసరస్వతి దేవి పూజ, అభిషేకం, కుంకుమార్చన,
▪ఉదయం 8 గంటల నుండి విద్యార్థులచే సామూహిక పుస్తక పూజలు, అక్షర స్వీకారములను చేపట్టనున్నారు.

శ్రీమహాదుర్గ, శ్రీమహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు కలిసి ఒకే క్షేత్రంలో ఉండడంవల్ల గత ఏడాది కంటే ఈసారి మరింత సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాలుగా నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు. దేవాలయ ప్రాంగణం పూలతో అలంకరించారు. అమ్మవార్లను కూడా ప్రత్యేకంగా అలంకరించనున్నారు. భక్తులకు సరిపడా అమ్మవారి ప్రసాదాన్ని ప్రత్యేకంగా తయారు చేయించానున్నారు. చదువుల తల్లి సరస్వతి దేవి వసంత పంచమి రోజునే జన్మించిందని, అక్షరానికి అది దేవతైన సరస్వతి అమ్మవారిని ప్రత్యేకంగా పూజించాలని, జీవితంలో అపారమైన విజయం, సంపద, శ్రేయస్సు కోసం జ్ఞానం అవసరమని, ఇందుకోసం వసంత పంచమి నాడు సరస్వతి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఆమె అనుగ్రహాన్ని పొందవచ్చని శ్రీమహాశక్తి దేవాలయ అర్చకులు తెలిపారు. వసంత పంచమి వేడుకల సందర్భంగా దేవాలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలకు సమస్త హిందూ బంధువులందరూ పాల్గొని అమ్మవార్లకు కృపకు పాత్రులు కాగలరని ఆలయ నిర్వాహకులు కోరారు.

Leave A Reply

Your email address will not be published.