- చింతన్ శివిర్ కార్యక్రమంలో మంత్రి పొన్నం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో సామాజిక రుగ్మతలను తొలగించడానికి దేశానికి దిక్యూచిగా కులగణన చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కుల గణన సర్వే లో తెలంగాణలో బీసీలు 56 శాతం ఉన్నారని, వారికి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. బీసీ లకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచడానికి శాసన సభ , శాసన మండలిలో బిల్లు చట్టం చేసుకొని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందన్నారు. తెలంగాణ సామాజికంగా సమానత్వం సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంపుకు మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈ మేరకు సామాజిక న్యాయం, సాధికారతపై కేంద్ర సామాజిక న్యాయమంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన డెహ్రాడూన్‌లో రెండు రోజుల “చింతన్ శివిర్” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లను ప్రభుత్వం స్థాపించిందని వివరిస్తూ.. విద్యకు ప్రజా పాలన ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సంవత్సర కాలంలో 69 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. నిరుద్యోగ యువతకు బీసీ ,ఎస్సీ ,ఎస్టీ ,మైనార్టీ ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి తెలంగాణ ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకాన్నీ ప్రారంభించిందని ఆయన తెలిపారు. మొదటి ఏడాది 6 వేల కోట్లతో 4 లక్షల మందికి ఆర్థిక వృద్ధి సాధించడానికి 50 వేల నుండి 4 లక్షల వరకు ఆర్థిక సహాయం చేసి వారికి జీవనోపాధి కల్పిస్తుందని తెలిపారు. తెలంగాణ లో వివిధ కార్పొరేషన్‌ల ద్వారా చాలా అద్భుతమైన పథకాలు కొనసాగుతున్నాయని పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేయడానికి కళ్యాణ లక్ష్మి, విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్, గీతా కార్మికుల రక్షణకు సేఫ్టీ కిట్స్, బీసీ స్టడీ సర్కిల్ ల ద్వారా నిరుద్యోగ విద్యార్థులకు గ్రూప్స్ , బ్యాంక్ , డీఎస్సీ శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు రైతులకు పెద్ద పీఠ వేస్తుందన్నారు. మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అందిస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు ఎన్నో పథకాలు ప్రారంభించిందన్నారు. రైతులకు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ ,సన్న వడ్ల కు 500 బోనస్ ,పంట నష్టపరిహారం , రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,,సన్న బియ్యం పంపిణీ,మహా లక్ష్మి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్ తదితర సంక్షేమ పథకాలు అందించడంతో పాటు పెట్టుబడులకు రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.