ముద్ర,భువనగిరి:
జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశంలో, జిల్లా ఎస్పీ కే నరసింహతో వెబెక్స్ ద్వారా పాల్గొని కలెక్టర్ మాట్లాడుతూ, ఈ విషయంలో సమగ్ర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కలెక్టర్ వివరించినట్లుగా, జిల్లాలో ఉన్న 6 ఇసుక రిచ్ లలో అక్రమ ఇసుక రవాణా వాహనాలు పట్టుబడితే, బైండవర్ కేసులు నమోదు చేసి జరిమానా విధించాలి. ప్రతి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో ఇసుక అందించడానికి ఆన్లైన్‌లో నమోదు చేపట్టి, ఇసుక కొరత రాకుండా చూడాలని సూచించారు.
అక్రమ రవాణా నియంత్రణ కోసం పోలీస్, రెవిన్యూ, మైనింగ్ శాఖల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మొబైల్ టీం ఏర్పాటు చేయాలని కలెక్టర్ చెప్పారు. ఈ టీం ఇసుక రిచ్‌లను పర్యటిస్తూ అక్రమ రవాణాను గుర్తించి చర్యలు తీసుకుంటుంది. 729 ఆమోదం పొందిన ఇసుక ట్రాక్టర్లకు రేడియం స్టికర్లు అమర్చాలని, ప్రతి రీచ్‌లో 24 గంటల పర్యవేక్షణ కోసం హై-ఎండ్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తదుపరి, ఏదైనా అనధికార వాహనం కెమెరాలో గుర్తించబడితే వెంటనే బ్లాక్ చేయబడుతుంది. మాన్యువల్ ప్రక్రియను పూర్తిగా నిలిపి, ఏప్రిల్ 1 నుండి ఇసుక సరఫరా ఆన్‌లైన్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ (OTPS) ద్వారా మాత్రమే నిర్వహించబడుతుంది. గ్రామ పంచాయతీ సెక్రటరీలు నిర్ధారించిన ఇసుక అవసరాన్ని సంబంధిత తహసీల్దార్ పర్యవేక్షణలో ఆన్లైన్ ద్వారా నమోదు చేస్తారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, రెవెన్యూ డివిజనల్ అధికారి వేణు మాధవరావు, మైనింగ్ ఏడి విజయ రామారావు, డిపిఓ యాదగిరి, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి బాలు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.