Take a fresh look at your lifestyle.

పోచంపల్లి చేనేత అభివృద్ధికి అనేక అవకాశాలు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
పోచంపల్లి చేనేతకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న నేపథ్యంలో, ఈ ప్రాంతాన్ని చేనేత వస్త్ర వ్యాపారం, టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
బుధవారం పోచంపల్లి మండల కేంద్రంలో టూరిజం పార్క్, చేనేత వృత్తిదారుల ఇండ్లను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మానేజ్మెంట్ టీంతో కలసి పరిశీలించారు. పోచంపల్లి చెరువు ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను హెచ్ఎండిఏ అధికారులతో సమీక్షించి అక్కడ జరిగే పనులను త్వరత్వరత్తిన పూర్తి చేయాలని టూరిజం పరంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. పోచంపల్లి చేనేత సహకార సంఘం సందర్శించి ఇక్కత్ ఉత్పత్తులను పరిశీలించారు. చేనేత కార్మికులతో ముఖా ముఖి మాట్లాడి చేనేత కార్మికుల సంక్షేమం, వారి స్థితిగతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు .
ఈ సందర్బంగా ఆయన సంబంధిత అధికారులతో కలిసి ప్రాంతంలోని ప్రస్తుత పరిస్థితులను సమీక్షిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలపై కీలక సూచనలు చేశారు. టూరిజం, చేనేత రంగాల అభివృద్ధి ఒకదానికొకటి అనుసంధానమై ఉండేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు. మార్కెటింగ్ సదుపాయాలను విస్తరించాలని సూచించారు. పోచంపల్లిని టూరిజం, చేనేత కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
అనంతరం పోచంపల్లి మండలం లోని జాలాల్పూర్ గ్రామంలో ఉన్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. ఈ సందర్భంగా సంస్థలో విద్యార్థులకు అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నైపుణ్యాభివృద్ధి కోర్సులపై శిక్షణ ఎలా అందిస్తున్నారో తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా చేనేత శాఖ ఏ.డి ఎ.శ్రీనివాస రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, తాసిల్దారు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో భాస్కర్,జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.