Take a fresh look at your lifestyle.

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ తప్పనిసరి -నాగర్ కర్నూల్ TUWJ IJU జిల్లా అధ్యక్షుడు విజయకుమార్

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకుంటామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన టి.యు.డబ్ల్యూ.జే ఐజేయూ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావించగా ఆయన సానుకూలంగా స్పందించారు.

ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు పి. విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి ఆర్. సురేష్ కుమార్ హాజరై జిల్లాకు సంబంధించిన ప్రధాన సమస్యలను రాష్ట్ర నాయకత్వ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీకి వినతిపత్రాలు సమర్పించి, సభా వేదికపై నుంచే సమస్యలను వివరించారు.

కల్వకుర్తి ప్రాంతానికి చెందిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అక్రిడేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో రంగారెడ్డి జిల్లా చూపిస్తున్న సమస్యను ప్రస్తావించగా, ఇది సాంకేతిక లోపమని గుర్తించిన నాయకులు రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అలాగే నల్లమల్ల ప్రాంతంలోని మన్ననూరు, బ్రహ్మగిరి కేంద్రాల్లో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులకు కూడా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంపై సంబంధిత కమిషనర్‌తో చర్చించి త్వరితగతిన పరిష్కారం కల్పిస్తామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో జర్నలిస్టులు ఎవరూ ఆందోళన చెందవద్దని, సమస్యలు త్వరలోనే పరిష్కారం కానున్నాయని జిల్లా అధ్యక్షుడు పి. విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి ఆర్. సురేష్ కుమార్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.