ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో గురువారం “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సభకు మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పారిశుధ్యం మరియు అభివృద్ధి పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో అధికారులు కట్టుబడి ఉండాలని సూచించారు. మండల సభలు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే వేదికలుగా మారాయని, ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ ప్రభుత్వ కార్యక్రమం విజయవంతం కావడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మండల స్థాయిలో ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం అవుతూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
ప్రజల అభిప్రాయాలు, సూచనలు, అవసరాల ఆధారంగానే సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు రూపుదిద్దుకుంటాయని పేర్కొన్నారు. ప్రణాళికలో భాగంగా పారిశుధ్యం, మౌలిక వసతులు, గ్రామీణాభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, రాయితీ గ్యాస్, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని వివరించారు. మహిళల సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఉపాధి అవకాశాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
విద్యా రంగంలో ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరానికి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి త్వరలో గృహ ప్రవేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామస్థులు తమ సమస్యలను నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో ప్రజలు అభివృద్ధి పనులకు సంబంధించిన పలు సమస్యలను ప్రస్తావించగా, సంబంధిత శాఖల అధికారులు వాటిని నమోదు చేసి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో, ఎంఆర్ఓ, మున్సిపల్ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ బాదం రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, గ్రామ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.