ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
విద్యాసంస్థల నిర్వహణ, విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం కల్వకుర్తి పట్టణంలోని జేపీ నగర్‌లో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల పరిస్థితులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్వహణ, హాస్టల్ వసతులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచించారు.
తనిఖీ సందర్భంగా పాఠశాలలో నిల్వ ఉంచిన బియ్యం, గుడ్లు, కూరగాయలు వంటి ఆహార సరుకులను పరిశీలించారు. అలాగే తరగతి గదులు, పరిశుభ్రత పరిస్థితులు, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అందిస్తున్న విద్యా ప్రమాణాలు, బోధన విధానంపై కూడా ఆరా తీశారు. ఉపాధ్యాయులతో మాట్లాడి బోధన నాణ్యతను మరింత మెరుగుపరచాలని సూచించారు.
తనిఖీ అనంతరం కలెక్టర్ భోజనశాలకు వెళ్లి విద్యార్థులతో కలిసి కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత, రుచి, పరిమాణం వంటి అంశాలను స్వయంగా పరిశీలించారు. భోజనం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ఇదే నాణ్యతను కొనసాగించాలని సిబ్బందికి సూచించారు.
విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. చదువుపై దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
పాఠశాలల నిర్వహణపై అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకు తగిన విధంగా అన్ని సౌకర్యాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, తహసీల్దార్ ఇబ్రహీం, పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు.