ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ పబ్లిక్ (మోడల్) స్కూల్ పనులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు. నిర్మాణ స్థలాన్ని సందర్శించిన ఆయన పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను ఒకే చోట అందించే విధంగా ఆధునిక సదుపాయాలతో తెలంగాణ మోడల్ స్కూల్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత విద్యార్థులకు ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు సమగ్ర విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డైనింగ్ హాల్, కిచెన్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, విశాలమైన తరగతి గదులు, మరుగుదొడ్లు, బాత్రూములు, ఆట స్థలం వంటి అన్ని ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
పాఠశాల భవనం నిర్మాణం వేగంగా కొనసాగుతున్నప్పటికీ, పనుల్లో నాణ్యతకు ఎలాంటి లోపం రాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భవనం బలంగా, సురక్షితంగా నిర్మించాలన్నారు.
అలాగే తరగతి గదులు, ప్రయోగశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యాలు వంటి మౌలిక వసతులు సమగ్రంగా ఏర్పాటు చేయాలని, పనులు నిర్దేశిత గడువులో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు.
ఎక్కడైనా ఆలస్యం గమనించినట్లయితే తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని, పనుల పురోగతిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. పాఠశాల నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం లభిస్తుందని, ప్రభుత్వ విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.