ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి హైకోర్టును పేల్చివేస్తామంటూ మంగళవారం బాంబు బెదిరింపులు రావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో హుటాహుటిన హైకోర్టుకు చేరుకున్నారు. కోర్టు ప్రాంగణంలో అనుమానం వచ్చిన ప్రతి వస్తువును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరకు ఆ బెదిరింపు ఉత్తదేనని తేల్చారు. ముందు జాగ్రత్త చర్యగా కోర్టు సిబ్బందిని, న్యాయవాదులను భద్రతా సిబ్బంది అప్రమత్తం చేశారు. న్యాయమూర్తుల ఛాంబర్లు, కోర్టు హాళ్లు, రిజిస్ట్రీ కార్యాలయంతో పాటు పార్కింగ్ ఏరియాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తనిఖీలు పూర్తయ్యే వరకు ఎవరూ లోపలికి రావొద్దని అధికారులు సూచించారు. అవాంఛనీయ ఘటనలు, చోటచేసుకోకుండా హైకోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.