Take a fresh look at your lifestyle.

ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలి కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం

ముద్ర ప్రతినిధి, మెదక్:*
ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని అధికారులకు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు.
మండల స్థాయిలో ప్రజావాణి యధాతధంగా కొనసాగుతుందని, శాఖల వారీగా
పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు.. అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు.
కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి నిర్వహించారు.
వివిధ సమస్యలపై ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవించుకున్నారు. అనంతరం అధికారులతో శాఖల వారీగా సమీక్షించారు.
కలెక్టర్ మాట్లాడుతూ…ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి అని ప్రతి సోమవారం ప్రజల సమస్యలపై ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మండల స్థాయిలో ప్రజావాణి యధాతధంగా కొనసాగుతుందని ప్రజలు అందించిన దరఖాస్తులపై క్షుణ్ణంగా పరిశీలించి అర్హత మేరకు పరిష్కార దిశగా కృషి చేయాలని ఆదేశించారు.
విద్యా, వైద్యం, వ్యవసాయం, తాగునీరు, సాగునీరు, వివిధ అంశాలపై ప్రజల నుండి విజ్ఞప్తులు వచ్చాయి. డిఆర్ఓ భుజంగరావు, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏఓ
యూనస్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ విలువ చెల్లించండి
రామాయంపేట పట్టణ ఫరిదిలోని భూమి నేషనల్ హైవే రోడడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్నవారికీ మార్కెట్ వాల్యూ ప్రకారం గజానికి 30 వేలు చెల్లించాలని బాధితులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ భూమిగా కాకుండా వ్యవసాయేతర భూమిగా పరిగణలోకి తీసుకొని మార్కెట్ విలువ ప్రకారము ధర నిర్ణయించి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. 33 ఎకరముల భూమి కోల్పోతున్నట్లు తెలిపారు.

ప్రతిరోజూ రావచ్చు:ఎస్పీ డీవీఎస్

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజూ పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుంది నిర్భయంగా వచ్చి కలవాలని  ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణిలో భాగంగా జిల్లాలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వివాదాలు, పోలీస్ సంబంధిత ఇబ్బందులను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావుకు నేరుగా విన్నవించుకున్నారు. ప్రతి ఫిర్యాదుదారునితో వ్యక్తిగతంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులను క్షుణ్నంగా పరిశీలించి, తక్షణమే పరిష్కార చర్యలు తీసుకునేలా సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

హోలీ ప్రశాంతంగా జరుపుకోవాలి

ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సమేతంగా సంతోషంగా హోలీ పండగను జరుపుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి జరిమానాలకు, రోడ్డు ప్రమాదాలకు కారకులై జైలు పాలుకావద్దని హెచ్చరించారు. హోలీ పండగ వేళ మన తోటి అడపడుచుల పట్ల గౌరవప్రదంగా నడుచుకోవాలని, పండగ పేరుతో అనవసరంగా కొత్త చిక్కులు కొని తెచ్చుకోవద్దని సూచించారు.
గొడవలకు, అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించబోమని, చట్టపరమైన చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. మద్యం మత్తులో చెరువులు, కుంటాల వద్ద స్నానాలకు వెళ్లి ప్రమాదాలకు గురై అనేక కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చిన ఘటనలను గుర్తు చేశారు. మద్యం మత్తులో ఎవరూ కూడా చెరువులు, కుంటాల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు.
చిన్న పిల్లలు తప్పనిసరిగా తల్లిదండ్రుల సమక్షంలోనే స్నానాలకు వెళ్లాలని, అతి ఉత్సాహంతో ప్రమాదాలకు గురి కాకూడదన్నారు. పిల్లల కదలికల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా దృష్టి పెట్టాలని, పిల్లల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.