ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
పాలమూరు లో పోలీసు రాజ్యం నడుస్తోందని, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా ఉంటూ బీ ఆర్ ఎస్ అభ్యర్థులకు అడ్డుకుంటూ అరాచకం చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. జిల్లా కేంద్రం లోని బీ ఆర్ ఎస్ క్యాంపు కార్యాలయం లో ఆయన విలేకరుల సమావేశం లో ఆయన పోలీసుల తీరు పై ఆగ్రహం చెందారు.ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎన్నికల కమిషన్ పరిధిలో అధికారులు పని చేయాలని,మహబూబ్ నగర్ జిల్లాలో ఆ పరిస్థితి కనిపిస్తలేదన్నారు.పోలీస్ అధికారులే మొత్తం నడుపుతున్నారని,అన్ని శాఖల పనులు వాళ్ళే చేస్తున్నారన్నారు.
తెలంగాణ పోలీస్ అంటేనే దేశంలో మంచి పేరు ఉందని,కొందరు అధికారుల తీరుతో డిపార్ట్మెంట్ కు చెడ్డపేరు వస్తుందని ఆయన తెలిపారు.
నామినేషన్ వేయడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వెంట పెద్ద మొత్తంలో కార్యకర్తలను అనుమతించిన పోలీసులు బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థుల వెంట మాత్రమే నిబంధనల ప్రకారం ముగ్గురిని పంపించారన్నారు.
నామినేషన్ విత్డ్రా చేసుకోమని చాలా మంది అభ్యర్థుల పై పోలీసులు ఒత్తిళ్లు తెచ్చారని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. పోలీసుల, కాంగ్రెస్ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి జిలాల్లో ఉందన్నారు. సామాన్యులు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి మహబూబ్ నగర్ లో లేదన్నారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని,ఎన్నికల అధికారులకు జరుగుతున్న విషయాలపై మాట్లాడితే అంత పోలీస్ చేస్తున్నారు..మాకు తెలియదని అంటున్నారన్నారు
పాలమూరులో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.పోలింగ్ సమయంలో పోలీసులు కాంగ్రెస్ కు అండగా ఉంటూ బీ ఆర్ ఎస్ నేతలను బెదిరిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు.
అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్న అధికారులపై ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు పంపించామని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో న్యాయవాదులు బెక్కం జనార్దన్, మనోహర్, కరుణాకర్ గౌడ్, స్వదేశ్, మురళి, ఉమామహేశ్వరి, రవిప్రకాష్, శ్రీహరి, రాంనాథ్ గౌడ్, శ్రీ రామ్ కుమార్ , మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.