Take a fresh look at your lifestyle.

బరికి దిగుదామా.. వద్దా? బీఆర్​ఎస్​ కు మండలి భయం

  • మళ్లీ పోటీకి వెనకడుగు?
  • గతంలో కూడా అదే పరిస్థితి
  • కరీంనగర్​ పట్టభద్రుల స్థానానికి మాత్రమే పోటీ
  • మిగతా చోట్ల అభ్యర్థులు కరువు
  • ఇప్పటికే ఖరారు చేసిన బీజేపీ
  • కసరత్తు చేస్తున్న కాంగ్రెస్​
  • గులాబీలకు మండలి ఫీవర్‌.. మళ్లీ వదిలేసినట్టేనా..?
ముద్ర, తెలంగాణ బ్యూరో :- కాంగ్రెస్ ప్రభుత్వం పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు….ఆందోళనలతో హోరెత్తిస్తున్న బీఆర్ఎస్ మళ్లీ కఠిన పరీక్షను ఎదుర్కునే సయమం రానే వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొందని ఆ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోంది. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో ఎంఎల్ సీ ఎన్నికల వేడి మొదలైంది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఒక ప‌ట్ట‌భ‌ద్రుల‌, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక‌ల షెడ్యూల్ బుధవారం  విడుద‌లైంది. ఇందులో వ‌రంగ‌ల్ – ఖ‌మ్మం – న‌ల్ల‌గొండ నియోజకవర్గం, మెద‌క్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – క‌రీంన‌గ‌ర్ ఉపాధ్యాయ నియోకవర్గాలు కాగా, మెద‌క్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌భ‌ద్రుల స్థానానికి ఎన్నిక‌లు జరగనున్నాయి.  ఈ నేపథ్యంలో మరోసారి ప్రజల తీర్పు   కోరనుంది. ఇదే బీఆర్ఎస్ కు భయంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఆ పార్టీకి రాజకీయంగా పెద్దగా ఏదీ కలిసి రావడం లేదన్న విషయం అందరికి  తెలిసిందే.  అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పూర్తిగా చతికిలపడింది.  ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ మరోసారి బదిలోకి దిగే అంశంపై  పలు రకాల సందేహాలు నెలకొన్నాయి.
వాస్తవానికి ఏడాది కిందట వరకు అధికారంలో ఉన్న ఆ పార్టీ…. రాష్ట్రంలో పదేండ్లు ఏకఛత్రాధిపత్యం సాగించింది. అసలు విపక్షం అనేదే లేకుండా కేసీఆర్ పాలన చేశారు. దీంతో ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా    రాష్ట్ర రాజకీయాలు సాగాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు ఏదైనా ఎన్నికకు వెళ్లాలంటేనే ప్రస్తుతం జంకుతోంది.  పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవిచూస్తే…పార్టీ క్యాడర్ లో మళ్ళీ నిస్తేజం వస్తుందన్న భయం ఆ పార్టీని వెంటాడుతోంది.  మరో వైపు ఈ స్థానాలక బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి అనౌన్స్‌ కూడా చేసేసింది. ఇక అధికార కాంగ్రెస్‌ కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది.ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ మాత్రం సైలెంట్ గా ఉంది. పోటీపై  అనేక రకాల సందేహాలు  వ్యక్తం అవుతున్నాయన్న ప్రచారం రాజకీయర్గాల్లో  వినిపిస్తోంది.  పోటీ చేద్దామా.. వద్దా అనే అయోమయంలో పడిందని తెలుస్తోంది. ఒకప్పుడు ఎన్నికలు అంటే…. తమకు ఎదురులేదని కాలరెగరేసిన గులాబీ దళం….. ప్రస్తుతం డీలా పడింది. ఎన్నికలకు వెళ్లాలంటే ఎందుకు భయపడుతున్నదన్న చర్చ రాష్ట్రంలో ప్రధానంగా వినిపిస్తోంది.
కరీంనగర్ నియోజకవర్గానికి మాత్రమే పోటీ
ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మూడు స్థానాలకు గానూ కేవలం కరీంనగర్ నియోజకవర్గం పట్టభద్రుల  స్ఖానానికి మాత్రమే పార్టీ నాయకులు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. మిగిలిన స్థానాలకు  ఎవరూ అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో మిగిలిన రెండు టీచర్ ఎంఎల్ సీ  స్థానాలకు అభ్యర్దులను నిలబడం దాదాపుగా అసాధ్యమేనని తెలుస్తోంది.ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని చోట్లా తిరుగులేని విజయాలు సాధించిన గులాబీ….. ఇప్పుడు అంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  కేవలం కరీంనగర్‌ గ్రాడ్యుయేట్‌ స్థానానికి మాత్రమే ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతుంటే.. మిగిలిన రెండు స్థానాలకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. ఇదిలా ఉండగా 2019లో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ గులాబీ పార్టీ అధికారికంగా అభ్యర్థిని ఎన్నికల బరిలో నిలపలేదు. స్వతంత్రంగా పోటీ చేసిన చంద్రశేఖర్‌ గౌడ్‌కు చివరి నిమిషంలో అనధికారిక మద్ధతు పలికింది. కానీ జీవన్ రెడ్డి గెలిచారు. ఈ సారి ఏం చేయబోతున్నారన్నది మాత్రం స్పష్టత లేదు. పోటీ చేసేందుకు పలువురు ఆసక్తిగా ఉన్నారు. కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, టీఎస్టీఎస్ మాజీ ఛైర్మన్ చిరుమల్ల రాకేష్, టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్ అవకాశంపై హామీ ఇస్తే పని చేసుకుంటా మన్నారు. కానీ ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.  ఇటు బీజేపీ నుంచి గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన అంజిరెడ్డిని ప్రకటించారు. ఉపాధ్యాయ నియోజకవర్గాలకు విద్యాసంస్థల యజమానుల్ని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలా లేకపోతే కొత్త వారికి చాన్స్ ఇవ్వాలా అని ఆలోచిస్తోంది. 
పోటీకీ దూరం?
అసలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరమని కేటీఆర్ సంకేతాలు ఇచ్చినట్టేనని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలంటే.. ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కువే కష్టపడాలి. ఎందుకంటే ఆయా సామాజిక వర్గాలు, విద్యావంతులు, రాజకీయాలను ఎక్కువగా పరిశీలించే వర్గాల ఓట్లే పెద్దల సభలో ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆయా టీచర్ల సంఘాల మధ్యనే పోటీ ఉంటుంది. అందుకే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ పార్టీలు ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణంగా రాజకీయ పార్టీలు పోటీ చేయబోవని, ఉద్యమ సమయంలో తెలంగాణ వాదం ఎజెండాగా పార్టీ అధినేత కేసీఆర్ ఆ ఎన్నికలను ఉపయోగించుకున్నారని కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఓటర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుందని, వాటి కంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని ఆయన చెప్పారు. అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారని చెప్పకనే చెప్పుకొచ్చారు. దానికి తగ్గట్లుగానే ఓటర్ల నమోదు సహా ఏ విషయంలోనూ బీఆర్ఎస్ చురుగ్గా లేదు. పరిస్థితి చూస్తూంటే.. ఈ ఎన్నికల గ్రౌండ్‌ను బీఆర్ఎస్.. కాంగ్రెస్, బీజేపీలకు వదిలేస్తున్నట్లుగా రాజకీయ పరిస్థితి మారింది. అంటే.. ఇక ఈ మూడు స్థానాల్లో పోటీ కేవలం బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యేనని తేలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.