Take a fresh look at your lifestyle.

మున్నూరు కాపు అభివృద్ధికి కృషి చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్‌లోని ఇందిరా గార్డెన్స్‌లో రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి ఘన అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరై బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి నియామకం సామాజిక వర్గాల అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 1986-87 కాలంలో కరీంనగర్ రాజకీయాల్లో బొమ్మ వెంకన్న, సత్యనారాయణరావు, వెంకట్ స్వామి వంటి నాయకులు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి వచ్చిన బొమ్మ శ్రీరామ్‌కు కాంగ్రెస్ పార్టీ మంచి అవకాశం కల్పించిందన్నారు.

గత పదేళ్లలో సంక్షేమ శాఖ నిర్వీర్యమైందని, హాస్టళ్ల అద్దెలు, మెస్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నాయకత్వంలో గ్రీన్ కారిడార్ విధానంతో అద్దెలు, మెస్ ఛార్జీలు చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఉన్నత విద్య చదివిన కుటుంబాలే అభివృద్ధి సాధిస్తున్నాయని సర్వేల్లో తేలిందన్నారు.

త్వరలోనే బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా శిక్షణ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి నాయకత్వంలో మున్నూరు కాపు సోదరులకు సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

బలహీన వర్గాల రిజర్వేషన్ల పెంపు అంశం కోర్టుల్లో నిలిచిపోయిందని, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వంలో కుల భవనాలకు కేవలం స్థలాలు మాత్రమే కేటాయించారని, ఇప్పుడు వాటికి నిధులు కేటాయించి జ్యోతిబాపూలే ఆత్మగౌరవ భవనాలుగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం కావాలని, కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా జిల్లాలోని మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుందని తెలిపారు. జిల్లా అభివృద్ధి, ధాన్యం కొనుగోలు, సాగునీటి రంగాల్లో కరీంనగర్‌ను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పారు.

ప్రజా పాలన ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, కొత్త రేషన్ కార్డులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మున్నూరు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.