ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రామగుండం ఫర్టిలైజర్ సంస్థపై కేంద్రం ఎరువుల శాఖ కార్యదర్శి రాజత్ మిశ్రా ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం న్యూఢిల్లీలో కలిశారు. తెలంగాణకు 2.7 లక్షల టన్నుల ఎరువులను సరఫరా చేసేందుకు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.తెలంగాణకు సరైన ఎరువుల సరఫరా లోపిస్తున్న అంశంపై,కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రాజత్ మిశ్రా ని న్యూఢిల్లీలో కలిసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ కీలకంగా చర్చించారు.రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ అనుకున్న ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోలేకపోవడం వల్ల,రాష్ట్ర రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని వివరించారు. యూరియా,డీఏపీ వంటి ముఖ్య ఎరువుల కొరత వల్ల సీజనల్ పంటల ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావం పడుతోందని గుర్తుచేశారు.ఈ సందర్భంగా ఎంపీ రాష్ట్రానికి ప్రత్యేక కోటా కేటాయింపు లాజిస్టిక్స్ సమస్యలు తక్షణ పరిష్కారం రామగుండం ప్లాంటు సామర్థ్యాన్ని పెంపుదల, ప్రైవేట్ ఎరువు విక్రయదారుల నియంత్రణ తదితర అంశాలను అధికారులు దృష్టికితీసుకొచ్చారు.కార్యదర్శి రాజత్ మిశ్రా ఈ సమస్యలను సానుకూలంగా తీసుకొని స్పందించారు.గత ఖరీఫ్,రబీ సీజన్లలో జరిగిన లోటు ను ఈ సీజన్‌లో పూర్తిగా భర్తీ చేస్తామని తెలంగాణకు మొత్తం 2.7 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేస్తామన్న హామీ ఇచ్చారు.
- రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తా.ఎంపీ వంశీకృష్ణ.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రామగుండం వంటి జాతీయ స్థాయి ఎరువుల ప్లాంట్ తెలంగాణలో ఉన్నా,అక్కడి రైతు లకు సరైన ఎరువులు దక్కక పోవడం అన్యాయమని కేంద్రానికి తెలియజేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో పాలసీ స్థాయిలో మార్పులు అవసరం.నా పోరాటం ఒక్క పార్టీ కోసం కాదు,రైతుకోసం ఎరువుల కొరత వల్ల ఒక్కరైనా రైతు నష్టపోవద్దని నిరంతరం కృషి చేస్తున్నాను.ప్రతి బస్తా ఎరువుకూ మా పోరాటం కొనసాగుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ,కేంద్రం నుంచి సహకారం అందుకోవడం లో ఇబ్బందులు ఎదురవుతున్నా యని ఎంపీ పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల కోసం అవసరమైతే పార్లమెంటు ఆందోళనలకు సైతం వెనుకాడమని హెచ్చరించారు.