Take a fresh look at your lifestyle.

ఎంబీసీ జాబితాలో మరో 14 కులాలు చేర్చాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం

ఇప్పటికే జాబితాలో 36 కులాలు
త్వరలోనే కేంద్రానికి బీసీ కమిషన్ సిఫార్సుల నివేదిక
11లక్షల మందికి చేకూరనున్న ‘సీడ్’లబ్ది
రాష్ట్ర సర్కార్ నిర్ణయం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఏళ్ల నుంచి ఆదరణకు నోచుకోని సంచార జాతులకు గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో సంచార జాతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సర్టిఫికెట్లు లేక పడుతున్న ఇబ్బందులను గుర్తించి వారికి గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) జాబితాను విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న జాబితాకు అదనంగా మరో 14 కులాలను చేర్చి.. ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో రాష్ట్రంలో సంచార జాతుల సంఖ్య 50కి చేరనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ంలో వేలాది కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ ఫలాలు అందనున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎంబీసీల జనాభా సుమారు 11 లక్షలకు పైగా ఉన్నది. ఇందులో వడ్డెర, బోయ కులాల జనాభా సగం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ.. మిగిలిన చిన్న కులాల వారు తీవ్రమైన పేదరికంలో మగ్గుతున్నారు. సంచార జీవనం గడిపే ఈ జాతులకు శాశ్వత చిరునామా లేకపోవడంతో వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. తాజాగా కేంద్రానికి పంపనున్న జాబితా ద్వారా వీరందరికీ డీడబ్ల్యూబీడీఎన్ సీ బోర్డు ద్వారా ప్రత్యేక గుర్తింపు లభించనుంది. దీనివల్ల అట్టడుగున ఉన్న ఈ 14 కులాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు.

ఎంబీసీ జాబితాలో చేరనున్న కొత్త కులాలు..
రాష్ట్ర బీసీ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ 14 కులాలను గుర్తించింది. దాసరి (బెగ్గరి), జంగం, పంబాల, వాల్మీకి బోయ, తల్యారీ, చుండువాళ్లు, యాట, కునపులి, రాజానాల, బుక్క అయ్యావార్స్, సిద్దుల, సిక్లిగర్, ఫకీర్, గుడ్డి ఏలుగు వాళ్లు. ప్రస్తుతం ఎంబీసీ జాబితాలో 36 కులాలు ఉండగా.. తాజా మార్పులతో ఈ సంఖ్య 50కి పెరుగుతుంది. ఈ కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన బీసీ కమిషన్.. వీరిని ఎంబీసీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వానికి నివేదించింది. ఎంబీసీ జాబితాలో చేరిన కులాలకు కేంద్ర ప్రభుత్వం డీనోటిఫైడ్ ట్రైబల్ సర్టిఫికెట్లను జారీ చేస్తుంది. దీంతో కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ‘స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీఎన్టీస్’ పథకం కింద పలు ప్రయోజనాలు లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత కోచింగ్.. కుటుంబ సభ్యులందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు.. సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి ఆర్థిక సాయం.. స్వయం ఉపాధి కోసం తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తారు.

Leave A Reply

Your email address will not be published.