Take a fresh look at your lifestyle.

పెద్దశేష వాహనంపై దర్శనమిచ్చిన శ్రీరాముడు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భూలోక వైకుంఠంగా విరాజిల్లుతున్న స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న దివ్య మహోత్సవాలలో భాగంగా ఐదవ రోజు మంగళవారం సాయంత్రం శ్రీ రాములవారు పెద్దశేష వాహనంపై అత్యంత వైభవంగా మాడ వీధులలో ఊరేగి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
ఆదిశేషుని మహిమను ప్రతిబింబించే ఈ వాహన సేవలో శ్రీ రామచంద్ర మూర్తి దివ్య అలంకారాలతో విరాజిల్లుతూ, భక్తులను కటాక్షిస్తూ క్షేత్ర వీధులలో విహరించారు. వేదఘోషలు, మంగళ వాద్యాల నాదాలు, గోవింద నామస్మరణల మధ్య ఈ దివ్య విహారం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మహోన్నతంగా మార్చింది.
అనేక ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు మాడ వీధులను నింపుకొని, భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటూ హారతులు సమర్పించి తమ భక్తిని వ్యక్తపరిచారు. పెద్దశేష వాహనంపై స్వామివారి దర్శనం భక్తుల హృదయాలలో అపారమైన ఆనందాన్ని నింపింది.

Leave A Reply

Your email address will not be published.