ముద్ర కూకట్‌పల్లి :
నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు సైబరాబాద్ పోలీస్ విభాగం నడుం బిగించింది. మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి, ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన, ఏసీపీలతో కలిసి జేఎన్టీయూ జంక్షన్ నుండి మూసాపేట్ వై-జంక్షన్ వరకు రహదారులను కాలినడకన పరిశీలించారు.
ఈ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జేఎన్టీయూ, కేపీహెచ్‌బీ మరియు మూసాపేట్ ప్రాంతాల్లో నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యలపై అధికారులతో చర్చించారు. వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న బాటిల్ నెక్స్ పాయింట్లు, అడ్డదిడ్డంగా ఉన్న డివైడర్లు మరియు యూ-టర్న్ల వద్ద మార్పులు చేయాలని సీపీ ఆదేశించారు.అవసరమైన చోట్ల రోడ్డు కరెక్షన్లు చేపట్టాలని
ఇంజనీరింగ్ విభాగాలకు సూచించారు.వాహనదారులు ఇబ్బంది పడకుండా సిగ్నల్ వ్యవస్థను, జంక్షన్ల డిజైన్లను మెరుగుపరచాలని తెలిపారు.
స్థానిక కేపీహెచ్‌బీ ఎస్ హెచ్ ఓ మరియు ట్రాఫిక్ ఎస్ హెచ్ ఓ లు నిరంతరం పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ సాఫీగా సాగేలా చూడాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ, కేపీహెచ్‌బీ లా అండ్ ఆర్డర్ ఎస్ హెచ్ ఓ, ట్రాఫిక్ ఎస్ హెచ్ ఓ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.