Take a fresh look at your lifestyle.

మూడు నెలల్లో 28 మంది.. ఊరు మొత్తం ఖాళీ.. మృత్యువు నీడలో ఒక గ్రామం గండ్రపల్లి

 

ముద్ర, కరీంనగర్ :

ఒక్క మరణం సంభవిస్తేనే ఆ వీధి అంతా మూగబోతుంది. అలాంటిది, కేవలం 90 రోజుల్లో 28 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతే.. ఆ ఊరి గుండె ఎంతలా తల్లడిల్లిపోతుందో ఊహించుకోవడం కూడా కష్టమే. జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి ఇప్పుడు సరిగ్గా ఇలాంటి వేదననే అనుభవిస్తోంది.

కన్నీటి ధారల మధ్య మృత్యు పరంపర
సినిమాలో చూసే ‘విరూపాక్ష’ భయం నిజ జీవితంలో ఆ ఊరిని చుట్టుముట్టింది. వరుసగా పాడెలు కడుతుంటే, తలకొరివి పెట్టే చేతులు వణుకుతుంటే.. ఆ గ్రామస్తుల కళ్లలో భయం కంటే ఎక్కువగా ‘మా ఊరికి ఏమైంది?’ అన్న ఆర్తి కనిపిస్తోంది. కొందరు నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉండి, తెల్లవారేసరికి విగతజీవులయ్యారు. మరికొందరు రోడ్డు ప్రమాదాల రూపంలో బలైపోయారు. మనసు విరిగి మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
కారణం ఏదైనా, చితి మంటలు మాత్రం ఆ గ్రామంలో ఆరడం లేదు.

నమ్మకానికి, భయానికి మధ్య ఊరి ఖాళీ

దైవ ప్రార్థనలు చేసినా, జంతు బలులు ఇచ్చినా మృత్యువు శాంతించకపోవడంతో.. ఆ ఊరి జనం ఒకే నిర్ణయానికి వచ్చారు. ఊరంతా ఒక్కటై, కన్నీళ్లతో తమ గడప దాటారు. “మా ఇళ్లు మాకు ప్రాణం.. కానీ మా మనుషులు మాకు అంతకంటే ముఖ్యం.” అనే ఆవేదనతో ఆ గ్రామం మొత్తం ఒక్కరోజు నిర్జనమైపోయింది. తెల్లవారుజామునే ఇళ్లకు తాళాలు వేసి, మూటముల్లె సర్దుకుని అడవి బాట పట్టిన ఆ దృశ్యం గుండెలను పిండేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు అన్న తేడా లేకుండా ఊరంతా పొలాల్లోకి చేరి ‘కీడు వంటలు’ చేసుకున్నారు. పితృదేవతలను వేడుకుంటూ, తమ గ్రామాన్ని కాపాడమని ఆకాశం వైపు చూస్తూ మొరపెట్టుకున్నారు.

ఆశ చావని పల్లె

నిశ్శబ్దంగా మారిన వీధులు, తాళాలు వేసిన తలుపులు.. ఆ ఊరి భయానికి నిదర్శనం. అయితే, ఈ ‘కీడు వంటలు’ పూర్తయ్యాకైనా తమ గ్రామంలో మళ్ళీ నవ్వులు పూస్తాయని, ఆ చావుల పరంపర ఆగిపోతుందని ప్రతి గండ్రపల్లి బిడ్డ ఆశగా ఎదురుచూస్తున్నాడు. మూఢనమ్మకమో, భయమో పక్కన పెడితే.. తమ ఆత్మీయులను కాపాడుకోవాలనే ఆ గ్రామస్తుల ఆరాటం మాత్రం అత్యంత భావోద్వేగభరితం.

Leave A Reply

Your email address will not be published.