Take a fresh look at your lifestyle.

ట్రాఫిక్ నియమాల అవగాహనతో ప్రాణ రక్షణ -డీజీపీ శివధర్ రెడ్డి

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ట్రాఫిక్ నిబంధనలను పాటించక పోవటమే ప్రమాదాలకు కారణమని, వీటిపై అవగాహన కల్పించడం “అరైవ్ అలైవ్” కార్యక్రమ లక్ష్యమని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.


నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిళలతో కలిసి పాల్గొన్నారు. డీజీపీకి గుస్సాడీ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం వల్ల జరిగే ప్రమాదాలు కుటుంబాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరాదని హెచ్చరించారు.అనంతరం రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రత వారోత్సవాల గోడప్రతులను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి డీజీపీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, అదనపు ఎస్పీలు రాజేష్ మీనా, సాయికిరణ్, డిపిఓ శ్రీనివాస్, డిఎంహెచ్వో రాజేందర్, ఎంవిఐ మహేందర్, సర్పంచ్ వనజ, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన డీజీపీ

మహిళా బాధితులకు తక్షణ సహాయం అందించే లక్ష్యంతో నూతనంగా నిర్మించిన భరోసా భవనాన్ని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, మొదటగా భరోసా ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పోక్సో కేసుల బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు.

కుటుంబ విభేదాల వల్ల విడిపోయి మళ్లీ కలిసిన జంటలకు ప్రోత్సాహకంగా బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు, బాలలపై జరిగే నేరాలకు వేగవంతమైన స్పందనతో పాటు బాధితులకు అన్ని విధాల సహాయం అందించడంలో భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
ఎస్పీ జానకి షర్మిల, భైంసా ఏ ఎస్పీ రాజేష్ మీనా, నిర్మల్ ఏ ఎస్పీ సాయి కిరణ్, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది,షి టీమ్, భరోసా సిబ్బంది ఈ కార్యక్రమంలో ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.