65 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు సీజ్
నలుగురు అనుమానితుల గుర్తింపు
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:
శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా కోసం సూర్యాపేట పట్టణంలోని సుందరయ్య నగర్ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 65 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలను సీజ్ చేయడంతో పాటు గతంలో నేరాలకు పాల్పడిన నలుగురు అనుమానితులను గుర్తించినట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు.
సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ఈ తనిఖీల్లో కాలనీలోని ప్రతి ఇంటిని పోలీసులు పరిశీలించారు. ఇతర రాష్ట్రాలు లేదా ప్రాంతాలకు చెందిన అనుమానితులు ఆశ్రయం పొందుతున్నారా, దొంగతనాలకు సంబంధించిన వాహనాలు ఉన్నాయా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా అనే అంశాలపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రజలకు భద్రత కల్పించేందుకు పోలీసు శాఖ నిరంతరం పనిచేస్తోందన్నారు. కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.
ప్రతి వాహనానికి సరైన పత్రాలు ఉండాలని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెచ్చరించారు. యువతను గంజాయి వంటి మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం ఆసుపత్రిలో ప్రత్యేక పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గంజాయి విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీలు నిర్వహించగా గతంలో నేరాలకు పాల్పడిన నలుగురిని గుర్తించామని, ప్రస్తుతం వారి కార్యకలాపాలపై విచారణ కొనసాగుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐలు ఏడుకొండలు, మహేందర్‌నాథ్, శివతేజ, ఐలయ్య, బాలు నాయక్, సైదిరెడ్డి, కనకరత్నం, వెంకన్న, ఏఎస్ఐలు నరేందర్‌రెడ్డి, ముత్తయ్య తదితరులు, స్పెషల్ పార్టీ మరియు పట్టణ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.