Take a fresh look at your lifestyle.

సిర్సనగండ్లలో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహణ

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

సిర్సనగండ్ల: చారిత్రాత్మక పుణ్యక్షేత్రమైన సిర్సనగండ్లలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. లోకక్షేమం కోసం జరిగిన ఈ పవిత్ర వేడుకల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు.

ఆలయానికి విచ్చేసిన అతిథులను అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతించారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించగా, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి, “జై శ్రీరామ్” నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు.

దక్షిణ అయోధ్యగా అభివృద్ధి: మంత్రి జూపల్లి

పూజా కార్యక్రమాల అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, సిర్సనగండ్ల క్షేత్రానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కాపాడుతూ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి “దక్షిణ అయోధ్య”గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.