హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పడంతో సద్దుమణిగిన పరిస్థితులు
ముద్ర ప్రతినిధి, రాజేంద్రనగర్ :
శివాలయం భూములను కబ్జా చేస్తున్న అధికారులు స్పందించడం లేదని స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే….. అత్తాపూర్ లోని చిన్న అనంతగిరి శివాలయం ముందు భాగంలో ఉన్న ప్రభుత్వ భూమి 354/1 సర్వే నెంబర్ లో ఉన్న ఒకటిన్నర ఎకరాల భూమి విషయంలో కోర్టులో కేసు ఉంది. ఈ వివాద విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ కు హైకోర్టు సూచించింది. అయితే సిక్కు మతం వారు నాలుగు రోజులుగా ఇక్కడ కంచవేసి స్థలాన్ని కబ్జా చేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులు రెండు రోజులుగా ఆలయం వద్ద ధర్నా చేశారు. సిక్కులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఆర్డిఓ, పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అధికారుల నుండి సరైన స్పందన లేకపోవడంతో బుధవారం స్థానికులు పెద్ద ఎత్తున శివాలయానికి చేరుకున్నారు. అక్కడి నుండి ర్యాలీ తీసి రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేశారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా. మారాయి.
స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం…
హైడ్రా కమిషనర్ రంగనాథ్
అత్తాపూర్ శివాలయం వద్ద పరిస్థితులు చేయి దాటిపోవడంతో సమాచారం అందుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడికి చేరుకున్నాడు. ధర్నా చేస్తున్న వారితో మాట్లాడి అక్కడి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం గురుద్వారా ప్రబంధక్ కమిటీ సభ్యులతో కూడా మాట్లాడి విషయం తెలుసుకున్నారు. సదరు భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నదని ఎవరు కబ్జాలు చేసిన ఉపేక్షించేది లేదని రంగనాథ్ హెచ్చరించారు. ఇట్టి ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనపరచుకోవడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి పక్షపాతాలకు తావుండదని, అసలు హైడ్రా ఉన్నదే భూములను కాపాడడానికి అన్నారు. ఈ విషయంలో ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని కరాకండిగా చెప్పడంతో స్థానికులు ఆందోళన విరమించారు.