Take a fresh look at your lifestyle.

అదే ముహూర్తం..!

  • మూడున మంత్రివర్గ విస్తరణ.
  • గవర్నర్​తో భేటీ అయిన సీఎం.
  • విస్తరణపై సుదీర్ఘ చర్చలు.
  • గవర్నర్​ చేతికి కొత్త మంత్రుల జాబితా.
  • శాఖల మార్పుపైనా కసరత్తు​.

ముద్ర, తెలంగాణ బ్యూరో : కేబినెట్​లో చోటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఆశావాహులకు ఫైరవీలకు బ్రేక్​ పడినట్లుగా మారింది. ఉగాది పండుగ వేళ సీఎం రేవంత్​రెడ్డి..రాష్ట్ర గవర్నర్​తో భేటీ కావడం, సుదీర్ఘంగా చర్చించడం కేబినెట్​ విస్తరణ కోసమే అని స్పష్టమవుతున్నది.దీంతో ఎప్పుడెప్పుడా అని ఆశావహులు ఎదురు చూస్తున్న మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది.ఆదివారం రవీంద్రభారతిలో ఉగాది వేడుకల తర్వాత సీఎం రేవంత్​ రెడ్డి.. నేరుగా గవర్నర్​ జిష్ణు దేవ్ వర్మ వద్దకు వెళ్లారు.ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు మంత్రి వర్గ విస్తరణపై చర్చలు జరిపినట్లు సమాచారం.కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ తేదీని తెలియజేయడంతోపాటు లాంఛనంగా కొత్త మంత్రుల లిస్ట్ ని గవర్నర్ కి అందించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులతో కలిసి రాజ్ భవన్‎కు వెళ్లిన సీఎం గవర్నర్‎ను కలిశారు. ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్పిన అనంతరం గవర్నర్‎తో చర్చించారు. కేబినెట్ విస్తరణ గురించే సీఎం రేవంత్ గవర్నర్‎తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో గవర్నర్‌తో సీఎం సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

  • విస్తరణ విశేషం

కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఉగాది తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల సీఎంతో పాటు మంత్రులు, టీపీసీసీ చీఫ్​ ఢిల్లీకి వెళ్లడం, ఏఐసీసీ నేతలతో భేటీ కావడంతో మంత్రివర్గ విస్తరణ ఖరారైనట్లు తెలుస్తున్నది.ఏప్రిల్​ 3న ముహూర్తం కూడా నిర్ణయించినట్లు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‎తో భేటీ కావడం ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. కొత్తగా నలుగురు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు ఇప్పటికే లీకులిచ్చాయి.కాగా, ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 15 నెలలుగా కేబినెట్ విస్తరణ పెండింగ్‎లో ఉండటంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే విస్తరణ చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం, హైకమాండ్ నిర్ణయించాయి.ఇందులో భాగంగానే ఇటీవల ఢిల్లీలో పార్టీ పెద్దలతో రాష్ట్ర నేతలు భేటీ అయ్యి మంత్రి వర్గ విస్తరణపై చర్చించారు.సామాజిక సమీకరణాలు, క్యాస్ట్ ఈక్వేషన్స్ వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతం నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కేబినెట్​లో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఈ జిల్లాలకు కేబినెట్లో అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం ఎవరూ మంత్రి వర్గంలో లేరు. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి దాదాపుగా మంత్రి పదవి ఖరారైపోయిందనే ప్రచారం ఉంది. అలాగే.. రెడ్డి సామాజిక వర్గానికి ఈ సారి రెండు మంత్రి పదవులు దక్కుతాయనే ప్రచారం ఉంది. రేసులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి చాలా కాలంగా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ముఖ్యంగా తాను హోంశాఖను కోరుకుంటున్నట్టు పదే పదే మీడియా వద్ద ప్రస్తావిస్తూ వస్తున్నారు.ఆయనకు బెర్త్ ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రులుగా ఎవరూ లేరు. బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి చాన్స్ వస్తుందనే ప్రచారం ఉంది. ముదిరాజ్ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఫిక్స్ అయినట్లు టాక్. ప్రస్తుతం భర్తీ చేయనున్న నాలుగు మంత్రి పదువుల రేసులో ఈ నలుగురు ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటి వరకు అయితే హైకమాండ్ అధికారికంగా మంత్రి పదవుల జాబితాను ప్రకటించలేదు.దీంతో ఆమాత్య యోగం ఎవరికీ దక్కుతుందోనని కాంగ్రెస్ శ్రేణులతో పాటు.. రాష్ట్ర రాజకీయాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

  • లిస్టులో ఎవరెవరు..?

మంత్రి వర్గ విస్తరణలో నలుగురికి చోటు లభిస్తుందనే విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డితో అధిష్టానం చర్చలు జరిపింది.సీఎం ఢిల్లీ పర్యటనలో దాదాపుగా లిస్ట్ కూడా ఖరారైపోయిందని అంటున్నారు. అయితే ఆ లిస్ట్ లోని పేర్లు మాత్రం ఇంకా బయటకు రాలేదు.దీంతో ఆశావహులు, వారి అనుచరులు, అభిమానులు విస్తరణ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నలుగురు ఖరారైనప్పటికీ.. కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం హస్తినలో ఫైరవీలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే, తాజాగా గవర్నర్​కు సీఎం రేవంత్​కొత్త మంత్రుల జాబితా కూడా అందించినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారు.అధిష్టానం ఆశీర్వాదం ఎవరికి దక్కిందనేది ఉత్కంఠగా మారింది.

  • మంత్రుల శాఖల్లో మార్పు..?

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో కూడా మంత్రి వర్గ కూర్పు విషయంలో పెద్ద కసరత్తే జరిగింది. సీఎం, డిప్యూటీ సీఎం పోస్ట్ లతోపాటు మంత్రి పదవుల కేటాయింపులో అధిష్టానం ఆచితూచి నిర్ణయం తీసుకుంది. సీనియర్లకు అవకాశం ఇస్తూనే పార్టీకోసం పనిచేసిన వారికి పదవులు అప్పజెప్పారు. తాజా విస్తరణలో కొత్తవారికి పదవులివ్వడంతోపాటు, పాతవారి శాఖల్లో మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది. ఏడాది కాలంలో కొంతమంది ఆయా శాఖలపై పట్టు సాధించడంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు భావిస్తున్నారు. మరికొంతమంది మంత్రులకు ఎక్కువ శాఖలు ఉండటంతో.. సరిగా పట్టించుకోవడం లేదనే విమర్శలూ వస్తున్నాయి. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని, ఆ తర్వాత మంత్రుల శాఖల్లో కూడా మార్పులు ఉంటాయని అంటున్నారు.ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడంతో పాటు ఇప్పుడున్న మంత్రుల శాఖలను కూడా మార్చే దిశగా కసరత్తు పూర్తయినట్లు చెప్తున్నారు. పనితీరు ఆధారంగా కాంగ్రెస్ హైకమాండ్ మంత్రుల శాఖల మార్పులు చేర్పులు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు ఇచ్చిన శాఖలపై సీనియర్ నాయకుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం చాలాకాలంగా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఉత్తమ్ దగ్గరున్న పౌరసరఫరాలు, ఇరిగేషన్ శాఖలు వేరొకరికి ఇచ్చి..వేరే కీలక శాఖలను ఆయనకు ఇచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.అయితే, ఉత్తమ్​ దగ్గర ఉన్న ఈ రెండు శాఖలు చాలా కీలకమైనవే అయినప్పటికీ..ఉత్తమ్​ మాత్రం వేరు శాఖలు అడుగుతున్నట్లు టాక్​.మరో సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన శాఖ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు ఇప్పటికే ప్రచారం.కోమటిరెడ్డి తన సీనియార్టీతో పనులు పరుగులు పెట్టించాలని చూస్తున్నా ఆయన నిర్వహిస్తున్న ఆర్ అండ్ బి శాఖలో అధికారులు సహకరించడం లేదన్న అభిప్రాయంలో ఉన్నారని, అందుకే ఆయన కూడా తన శాఖను మార్చమని కోరుతున్నట్లు టాక్. అటు సినిమాటోగ్రఫీ కూడా వద్దని చెప్తున్నట్లు టాక్​ వినిపిస్తుంది.

  • ఎక్సైజ్ శాఖను మరొకరికి కేటాయిస్తారా?

ఇక, ఎక్సైజ్‌ శాఖ పనితీరుపైనా ప్రభుత్వ, పార్టీ పెద్దలు అసంతృప్తితో ఉన్నట్లు ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడైంది. ఇటీవల బీర్ల ధరల పెంపు, కొత్త బార్ల నోటిఫికేషన్​పై మంత్రికి స్పష్టమైన సమాచారం కూడా లేదంటున్నారు. ఆ శాఖను చూస్తున్న జూపల్లి కృష్ణారావు దగ్గరున్న ఎక్సైజ్ శాఖను మరొకరికి ఇచ్చే ఛాన్స్‌ ఉందంటున్నారు. అలాగే ఇప్పుడు మంత్రుల దగ్గర అదనంగా ఉన్న శాఖలను కొత్త మంత్రులకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు.

  • హోం మంత్రి ఎవరు..?

ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరున్న హోంమంత్రి పదవి సుదర్శన్‌రెడ్డికి దక్కొచ్చంటూ ఢిల్లీ నుంచి లీక్‌లు వస్తున్నాయి. పార్టీలో సీనియర్ కావడం, వివాదరహితుడిగా ఉన్న పేరు, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో హైకమాండ్ ఆయన వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, హోం మంత్రి మహిళకు కేటాయిస్తే..సీతక్క పేరు వినిపిస్తుంది. ఇంకా సీఎం దగ్గర ఉన్న మున్సిపల్​ శాఖను ఇప్పుడున్న పరిస్థితుల్లో మరొకరికి ఇచ్చే అవకాశం లేదంటున్నారు.అంతే కాకుండా ఈ విస్తరణలో బీసీ మంత్రికి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాల్లో టాక్​.

Leave A Reply

Your email address will not be published.