ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య అంతర్జాతీయంగా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం అల్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కొరత లేదని నమ్మబలుకుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం సామాన్యులకు సిలిండర్లు దొరకడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ మంగళవారం అసెంబ్లీ సమీపంలోని గన్‌పార్క్ వద్ద భారీ నిరసన చేపట్టింది. కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ కొరత లేదంటుందనీ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలియం శాఖ తమ చేతుల్లో లేదని తప్పించుకుంటుందని అన్నారు. వీరిద్దరి తీరు చూస్తుంటే ఆంబోతుల కొట్లాటలో లేగ దూడలు బలైనట్లుగా సామాన్య ప్రజల పరిస్థితి తయారైందని విమర్శించారు. భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ పరిమాణాన్ని 14 కిలోల నుంచి 10 కిలోలకు తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఇది ప్రజలను మరింత ఇబ్బంది పెట్టడమేనని అన్నారు. గ్యాస్ సరఫరాపై ఉన్న అయోమయాన్ని తొలగించేలా ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.