ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
హైదరాబాద్: అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో నిర్వహించిన టీజీ ఆర్టీసీ (TGRTC) సమీక్షా సమావేశంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గానికి సంబంధించిన పలు రవాణా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగర్ కర్నూల్‌లో కొత్తగా మంజూరైన బస్ స్టేషన్ నిర్మాణానికి తక్షణమే శంకుస్థాపన తేదీని ఖరారు చేయాలని కోరారు. ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు ఈ ప్రాజెక్ట్ త్వరగా ప్రారంభం కావాల్సిన అవసరం ఉందన్నారు.
అలాగే తెల్కపల్లి, తిమ్మాజీపేట బస్సు డిపోల దుస్థితిని వివరించి, వెంటనే మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల విన్నపం మేరకు నాగర్ కర్నూల్ నుండి నల్గొండకు కొత్త బస్సు సర్వీసును ప్రారంభించాలని, అలాగే నియోజకవర్గంలోని కీలక మార్గాల్లో బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు.
ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ (IAS), టీజీ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి (IPS) తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.