ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని నల్లమల అడవిలో వెలసిన లింగమయ్య స్వామి ఆలయంలో జరగనున్న సలేశ్వరం జాతరకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశమున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి నల్లమల అటవీ ప్రాంతాన్ని సందర్శించి జాతర ఏర్పాట్లు, ట్రెక్కింగ్ మార్గాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అడవిలోని క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి మరింత రద్దీ ఉండే అవకాశముందని తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం తాగునీటి సరఫరా, వైద్య సేవలు, తాత్కాలిక శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు. అడవి మార్గాల్లో స్పష్టమైన మార్గదర్శక బోర్డులు ఏర్పాటు చేయడం, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక సూచనలు ఉంచడం, అవసరమైన చోట్ల సిబ్బందిని నియమించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.
శుభ్రత నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చెత్త నియంత్రణ చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు వైద్య బృందాలు, అత్యవసర సేవల సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అగ్నిప్రమాదాల నివారణ కోసం ఫైర్ సిబ్బంది, ఫైర్ ఇంజిన్లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.
భక్తుల రద్దీ నియంత్రణకు ముఖ్య ప్రాంతాల్లో మైక్ సిస్టమ్ ఏర్పాటు చేయడం, పోలీస్ శాఖ ద్వారా ప్రత్యేక ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేయాలని సూచించారు. తప్పిపోయిన భక్తులను గుర్తించి కుటుంబ సభ్యులకు చేరవేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా విస్తరించడం, చల్లని నీడ కల్పించే శిబిరాలు ఏర్పాటు చేయడం, విశ్రాంతి కోసం తాత్కాలిక షెడ్లు, టెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
భక్తుల భద్రత దృష్ట్యా గర్భిణీ మహిళలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు జాతరకు రాకుండా ఉండాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. నల్లమల అడవిలోని కఠినమైన ట్రెక్కింగ్ మార్గాలు, ఎత్తైన ప్రదేశాలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందుబాటులో ఉన్నప్పటికీ భక్తులు తమ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సురక్షితంగా, సౌకర్యవంతంగా స్వామి దర్శనం పొందేలా జిల్లా యంత్రాంగం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సందర్శనలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.