ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పిలుపునిచ్చారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలలో స్పెషలిస్ట్ వైద్యులతో నిర్వహిస్తున్న వైద్య స్క్రీనింగ్ శిబిరాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గురువారం పరిశీలించారు.ఈసందర్భంగా సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు.
ఆసుపత్రిలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ నమోదు ప్రక్రియ, డేటా ఎంట్రీ, రోగుల వివరాల సేకరణ విధానాన్ని పరిశీలించిన కలెక్టర్, రోగులకు ఇబ్బందులు కలగకుండా ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్లను పెంచాలని, ఇంటర్నెట్ వేగాన్ని మెరుగుపర్చాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు సూచించారు.అనంతరం ఓపీ విభాగాలు,సర్జికల్, స్త్రీ,పురుషుల మెడికల్ ఓపీలు,ఫార్మసీ డిస్పెన్సింగ్ యూనిట్,ఫార్మసీ స్టోర్స్,రిజిస్ట్రేషన్ కౌంటర్లు, క్రిటికల్ కేర్ విభాగం తదితరాలను పరిశీలించి రికార్డుల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.తదుపరి స్థానిక రైతు బజార్ సమీపంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్, వందరోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఆర్‌బీఎస్‌కే నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు రక్తహీనత,కంటి,చెవి,దంత సమస్యలు,పోషకాహార లోపాలను గుర్తించి అవసరమైన చికిత్సకు రిఫర్ చేస్తున్నట్లు వైద్యులు కలెక్టర్ కు వివరించారు.
అనంతరం మార్క్స్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను సందర్శించి, స్పెషలిస్ట్ వైద్యులతో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాన్ని పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలు, హెల్త్ రికార్డుల నిర్వహణ, మెడికల్ ఆఫీసర్ గది, ఔషధ నిల్వ గది,ప్రయోగశాల తదితర విభాగాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు.
జిల్లాలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యులు,సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ,డీసీహెచ్‌ఎస్ కవిత,డాక్టర్ శశాంక్ తదితర వైద్యాధికారులు పాల్గొన్నారు.