Take a fresh look at your lifestyle.

మహిళల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యం: పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్.

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామాల్లో సంక్షేమం విస్తరణ: కలెక్టర్ పి. ప్రావీణ్య.
ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరాలి

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి.

కొండాపూర్ మండలం తోగార్పల్లి గ్రామంలో గురువారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పాల్గొన్నారు.


గ్రామ సభను రాష్ట్ర గీతంతో ప్రారంభించారు. అనంతరం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగాన్ని గ్రామ ప్రజలకు వినిపించారు.
ఈ సందర్భంగా అధికారులు గ్రామంలో అమలవుతున్న పలు కీలక పథకాల వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా పంచాయతి రాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ… జిల్లాలో అధిక శాతం అధికారులుగా మహిళలే ఉన్నారని, మహిళలు పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
ఉపాధి హామీ పథకం ద్వారా సీసీ రోడ్లు, శానిటేషన్ పనులు, గ్రామపంచాయతీ భవనాలు, సంఘ భవనాలు నిర్మించుకోవచ్చని వివరించారు. ఉపాధి కార్డుదారులకు 100 రోజుల పని కల్పించాలని, వేసవిలో కూలీలకు తాగునీరు, నీడ, ఫస్ట్ ఎయిడ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్త వేరు చేసి అందించాలని సూచించారు. గ్రామ సభలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరేలా కృషి చేయాలని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించి, స్వయం సహాయ సంఘాలకు రుణాలు, డిజిటల్ హెల్త్ కార్డులు, జీవనోపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళలను బస్సు, పెట్రోల్ బంక్ యజమానులుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
మహిళలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చునని అన్నారు .
ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఇప్పటికే గ్రామాల్లో శానిటేషన్ డ్రైవ్ నిర్వహించామని, రాబోయే 90 రోజుల్లో శాఖల వారీగా పది ముఖ్య అంశాలపై కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. గ్రామాలలో అమలవుతున్న పథకాల లబ్ధిదారుల వివరాలను వెల్లడిస్తూ, గ్రామ సభలలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో ప్రజలు తమ అర్జీలు, అభ్యంతరాలు, సూచనలు సమర్పించాలని సూచించారు.
జిల్లాలో రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి రూ.12,000 చొప్పున రైతులకు ఆర్థిక సహాయం అందిస్తూ 2025-26 యాసంగి సీజన్‌కు రూ.167 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద జిల్లాలో 12649 మంది లబ్దిదారులకు ఎంపిక చేసిన 443 ఇండ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం వివిధ దశల నిర్మాణం లోఉన్న ఇండ్లకు రూ.163 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో పాటు నిరాశ్రయులకు స్థలాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో డిసెంబర్ 2023 నుండి ఇప్పటివరకు దాదాపు 4.98 కోట్ల మంది మహిళలు ప్రయాణించి రూ.224.68 కోట్ల మేర ఆదా చేసుకున్నట్లు తెలిపారు.
రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం కింద జిల్లాలో 1,76,570 మందికి రూ.22 కోట్ల సబ్సిడీ అందించగా, గృహజ్యోతి పథకం కింద 2,17,527 లబ్ధిదారులకు రూ.165.39 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. సన్న రకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తూ, 2,14,785 టన్నుల కొనుగోలు చేసి రూ.10.73 కోట్ల బోనస్ రైతులకు అందించినట్లు తెలిపారు .చేయూత పథకం, సామాజిక భద్రత పెన్షన్లు, కింద 1,52,571 మందికి రూ.36.02 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. జిల్లా లో 2025-26 ఆర్ధిక సంవత్సరం నకుగాను మహిళా శక్తి పథకం కింద 13,525 స్వయం సహాయ సంఘాలకు రూ.801.33 కోట్ల రుణాలు, 15,074 గ్రూపులకు వడ్డీ లేని ఋణాలు రూ.49.70 కోట్ల రూపాయలు అందించడం జరిగింది .ఇందిరమ్మ చీరల పథకం కింద 1,98,560 చీరలు పంపిణీ చేయగా, ఆహార భద్రత కింద 51,490 కొత్త రేషన్ కార్డులు జారీ చేసి, 1,56,720 మందికి లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ప్రతి నెల 9017 మెట్రిక్ టన్నుల సబ్సిడీ బియ్యం పంపిణీ జరుగుతోందని తెలిపారు .
ప్రభుతం కొత్తగా అల్పాహారం పథకం, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం,దివ్యాంగ విద్యార్థులకు మోటర్ వాహనాల పంపిణీ, మధ్యాహ్నం భోజనం పథకం ఇంటర్నెట్ వరకు విస్తరణ, పంటల సహజ సేంద్రియ వ్యవసాయం పంటల వైవిధ్య కరణ వంటి పథకాలను చేపట్టనున్నట్లు తెలిపారు . ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరేలా అధికారులు కృషి చేయాలని, గ్రామ సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భముగా సభకు హాజరైన లబ్ధిదారులు రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందిన రైతులు,సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమ అభిప్రాయాలను తెలిపి సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం తోగరుపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న మహిళా భవనం పనులను పరిశీలించారు. అలాగే గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి, ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను కమిషనర్ దివ్య దేవరాజన్ సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, పీడీ డీఆర్‌డీఓ జ్యోతి, గ్రామ సర్పంచ్ దివ్య వాణి ప్రశాంత్ గౌడ్, ఉపసర్పంచ్ , ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.