Take a fresh look at your lifestyle.

నాలుగెకరాల వరకు రైతు భరోసా నిధులు జమ

  • రైతు భరోసా కోసం మరో రూ.1313.53 కోట్లు నిధులు విడుదల.
  • మరో వారంలోగా పూర్తిగా రైతు భరోసా నిధుల జమ.
  • మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : నాలుగెకరాల వరకు రైతు భరోసా నిధులు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు, ఇందుకోసం మరో రూ. 1313.53 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. దీంతో మరో 21.89 లక్షల ఎకరాలకు సంబంధించిన 6.33 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారని, ఇప్పటి వరకు మొత్తం 5215.26 కోట్లు రైతుభరోసా కోసం విడుదల చేసి, 58.04 మంది రైతులకు సహాయం అందించినట్టు తెలిపారు. 9 రోజుల్లో 9 వేల కోట్లను రైతుల ఖాతాలలో జమ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వరుసగా మూడో రోజు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. ఎకరాలతో సంబంధం లేకుండా సాగు యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా సహాయాన్ని అందిస్తామని చెప్పారు. రైతుభరోసా విషయంలో బిఆర్ఎస్ నాయకులకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక సందర్భంలో మినహా, వానాకాలం రైతుబంధు సహాయం ఎప్పుడు సాగు కాలానికి ముందుగా ఇవ్వలేకపోయిందని, ప్రతిసారి ఆలస్యంగానే రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలోకి జమ చేసారని, అదికూడా 10వ నెల వరకు కొనసాగేదని అన్నారు. అలాగే ఏ ఒక్క సందర్భంలో కూడా 3 రోజుల్లోనే 5 వేల కోట్లకు పైగా రైతుబంధు కోసం ఖర్చు పెట్టిన దాఖలాలు లేవని మంత్రి పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనాలోచిత పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా, తమ ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం దేశానికే ఆదర్శంగా 2 లక్షల లోపు రైతు రుణమాఫి పథకాన్ని పూర్తిచేసి చూపించామన్నారు. అలాగే రైతు భరోసా పథకం కింద ఎకరాకు 5 వేల నుండి 6 వేలకు పెట్టుబడి సహాయాన్ని పెంచి, రైతులకు అందచేస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందే ఇవ్వాల్సిన యాసంగికి సంబంధించిన రైతుబంధు నిధులను ఇవ్వకుండా గత ప్రభుత్వం వదిలేస్తే, తాము అధికారంలోకి రాగానే వాటిని కూడా చెల్లించామని అన్నారు. రైతుల సంక్షేమం కోసం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే దాదాపు 77000 కోట్లు రైతు సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తుమ్మల అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్న కూడా 9 రోజులలో రైతుభరోసా సహాయాన్ని పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉందనేందుకు ఇదొక ఉదాహరణ అని ఆయన అన్నారు. ఇప్పటికైనా బిఆర్ఎస్ నాయకులు ఆత్మ విమర్శ చేసుకొని మా ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలని, లేదంటే తెలంగాణ రైతాంగం ఎప్పటికి క్షమించరని మంత్రి తుమ్మల హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితులలోనైనా తెలంగాణ రైతాంగం కోసం తమ ప్రభుత్వం నిలబడుతుందని, వారి సంక్షేమమే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.