Take a fresh look at your lifestyle.

‘‘చార్ పత్తా’’ సినిమా మొదలైంది

  • బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పార్టీ.
  • 6 గ్యారంటీలపై చర్చను దారి మళ్లించేందుకు కాంగ్రెస్ ఎత్తుగడ.
  • బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదు.
  • రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ముమ్మాటికీ దేశద్రోహమే.
  • భారతసైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి.
  • బీజేపీకి అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.
  • 14 పంటలకు ఎమ్మెస్పీ పెంపు హర్షణీయం.
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : కల్వకుంట్ల ఆర్ట్స్ పతాకంపై కాంగ్రెస్ పార్టీ దర్శకత్వంలో కల్వకుంట్ల కవిత ప్రధాన పాత్రధారిగా ‘చార్ పత్తా’ సినిమాను నడిపిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రజలకు ఎలాంటి మేలు కలిగించని ఇట్లా డ్రామాలతో సాధించేదేమీలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, దీనిపై ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉండటంతో వాళ్ల ద్రుష్టిని మళ్లించేందుకు ఇట్లాంటి ఎత్తుగడ వేస్తోందని విమర్శించారు. ఈరోజు కరీంనగర్ లోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో, చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలోని మధురానగర్ లో, బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లెలో వివిధ అభివ్రుద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే గతంలో కరీంనగర్ లోని అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రశాంతనగర్ లోని వడ్డెర బస్తీలో 13 గుడిసెలు పూర్తిగా, మరో 12 గుడిసెలు పాక్షికంగా దగ్దమైన విషయం తెలిసిందే.ఆ సమయంలో కేంద్ర మంత్రితోపాటు నాటి మేయర్ సునీల్ రావు బాధితులను పరామర్శించి తాత్కాలిక షెల్టర్ ఏర్పాటు చేశారు. అందరికీ నిత్యావసర వస్తువులన్నీ అందించారు. అట్లాగే ఇండ్లు నిర్మించుకోవడానికి ఆర్ధిక సాయం అందించారు. ఈరోజు వారి బతుకు దెరువుకు అవసరమైన 13 డ్రిల్లింగ్ మిషన్లను ఎంపీ లాడ్స్ నుండి కొనుగోలు చేసి బాధితులకు పంపిణీ చేశారు.

గంగాధర మండలంలో జాతీయ ఉఫాధి హామీ పథకం కింద రూ.2.63 కోట్ల వ్యయంతో 23 గ్రామాల్లో వివిధ అభివ్రుద్ధి పనులు చేపట్టినం. అందులో భాగంగా రూ.30 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీ పనులను స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లెలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద 2 కోట్ల 33 లక్షల కోట్ల నిధులతో చేపట్టిన హైలెవెల్ బ్రిడ్జి పనులకు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలో 2.64 కోట్ల జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో 23 గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీ, ఇతర అభివ్రుద్ది పనులు చేపట్టడం జరిగింది.ప్రజల ఇబ్బందులను గుర్తుంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివ్రుద్ధి పనులు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని అభివ్రుద్ధి చేసేందుకు క్రుషి చేస్తున్నాం.అందులో భాగంగానే రూ.30 లక్షలతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ ని ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో సీఆర్ఐఎఫ్ నిధులతో ఈ ప్రాంతాన్ని మరింత అభివ్రుద్ధి చేసేందుకు క్రుషి చేస్తాం. ఇక ఇతర విషయాల్లోకి వస్తే పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం.బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2014లో బీజేపీ ఇచ్చిన హామీని మోదీ నెరవేరుస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరల ప్రకారం, వడ్లకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు 69 రూపాయలు పెంచారు. పెంచిన ధరతో కలిపి సాధారణ వడ్లకు MSP 2,369 రూపాయలు, ‘ఏ’ గ్రేడ్ రకం వరి ధాన్యం ధర క్వింటాల్‌కు 2,389 రూపాయలైంది. యూపీఏ హయాంలో వడ్లకు కనీస మద్దతు ధర రూ.1310 ఉంటే మోదీ హయాంలో రూ.2389లకు పెరిగింది. అంటే గతంలో ఇచ్చిన హామీ మేరకు MSP 81 శాతం పెంచారు.

వీటితోపాటు పత్తి 589 రూపాయలు, నువ్వులు రూ. 579 రూపాయలు, మొక్కజొన్న 2,400 రూపాయలదాకా కనీస మద్దతు ధర పెంచినం.. నూనెగింజల విషయానికొస్తే పల్లీలకు 480 కు, సన్ ఫ్లవర్ కు 441, సోయాబీన్‌ కు 436 ల చొప్పున కనీన మద్దతు ధర పెంచినం. పప్పుధాన్యాల విషయానికొస్తే కందులకు 450, పెసరపప్పుకు 86లు, మినుములకు 400 రూపాయలు అదనంగా ఎమ్మెస్పీ పెంచినం. మోదీ ప్రభుత్వం వచ్చాక వడ్లకు 81 శాతం, జొన్నలకు 147 శాతం, సజ్జలకు 122 శాతం రాగులకు 226 శాతం, మొక్కజొన్నకు 83 శాతం, పెసర్లకు 95 శాతం, పల్లీలకు 82 శాతం కనీస మద్దతు ధర పెరిగింది. వీటితోపాటు యూరియా ధర మార్కెట్లో విపరీతంగా పెరిగినప్పటికీ ఆ భారమంతా కేంద్రమే భరిస్తూ రైతులకు సబ్సిడీపై అందిస్తూ రైతులకు ఒక్కో ఎకరానికి 18 నుండి 20 వేల రూపాయలదాకా పెట్టుబడి భారాన్ని తగ్గించింది. ఇగ పండించిన వడ్లను పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేస్తోంది. గత పదేళ్లలో వడ్ల కొనుగోలు కోసమే దాదాపు 2 లక్షల 29 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.

రాబోయే రోజుల్లో రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.ఈ విషయంలో కేంద్రం చేయాల్సిందంతా చేస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసింది. యాసంగి వడ్లకు సంబంధించి రైతులు ఎన్ని బాధలు పడ్డరో కళ్లారా చూసినం. వానలతో పండించిన పంట కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోతుంటే కనీసం టార్పాలిన్లు కూడా ఇయ్యకుండా రైతులను వేధించిర్రు. తాలు, తడిసిన వడ్లని సాకు చూపుతూ క్వింటాలుకు పది కిలోలదాకా కటింగ్ చేసి రైతులను దోచుకున్నరు. ఇగ బోనస్ పైసలిస్తమన్నరు. ఇంతవరకు నయాపైసా ఇయ్యలే. అసలు వడ్ల కొనుగోలు పైసలే ఇంతవరకు రాలేదని రైతులంతా మొత్తుకుంటున్నరు. రైతుల విషయంలో కేసీఆర్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది.

అన్నీ గాలికి వదిలేసి 18 నెలలుగా టైంపాస్ పొలిటిక్స్ చేస్తున్నారు. 6 గ్యారంటీలపై చర్చ జరుగుతుంటే ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నరు. బీఆర్ఎస్ సర్కార్ అవినీతి విషయంలో కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తామన్నారు. కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, ఫాంహౌజ్, ఫార్ములా ఈ రేసు కేసుల విషయంలో కేసీఆర్, కేటీఆర్ లను అరెస్ట్ చేస్తామని చెప్పి మాట తప్పారు. కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం పూర్తిగా పోయింది. ఢిల్లీకి పోయి మూటలు అప్పగించడం తప్ప కాంగ్రెసోళ్లతో ఏదీ చేతగాదని తేలిపోయింది.వేములవాడ రాజన్న ఆలయ పరిధిలో 18 గోవులు చనిపోవడంపై అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. గోవులను కూడా రక్షించకపోతే ఎట్లా? సరైన సౌకర్యాలు కల్పించి వాటిని కాపాడాల్సిన బాధ్యత వాళ్లపై లేదా? అట్లాగే గోవుల సంఖ్యకు తగినట్లుగా తగిన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకునేలా ఆలయ ఈవోతో మాట్లాడతా. అట్లాగే రాజన్న ఆలయంలో భక్తుల సంఖ్య పెరుగుతోంది.ఆదాయం కూడా పెరుగుతున్నందున భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలే తప్ప భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలు. భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచిపోషించేలా ఉన్నాయి. రాఫెల్ యుద్ద విమానాలను వినియోగించింది భారత సైన్యం. వాటిని విమర్శించడమంటే భారత సైన్యంపై కాంగ్రెస్ కు నమ్మకం లేనట్లుగా భావించాల్సి ఉంటుంది. ఆర్మీ చీఫ్ పై విశ్వాసం లేదా? మాట్లాడితే ఇందిరాగాంధీ గురించి మాట్లాడతారు. ఇందిరా హయాంలో యుద్దం జరిగితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయింది? పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎందుకు విడిచిపెట్టారు? కాశ్మీర్ లో రెండు జాతీయ జెండాలు, రెండు రాజ్యాంగాలకు అనుమతి ఇచ్చిందెవరు కాంగ్రెస్సే కదా? పుల్వామా దాడిలో భారత సైనికులను చంపితే పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి ఉగ్రవాదులను మట్టుబెట్టిన చరిత్ర భారత సైన్యానికి ఉంది. అమెరికాలో సెప్టెంబర్ 11 దాడుల్లో ట్విన్ టవర్స్ పై ఉగ్రవాదులు దాడి చేస్తే 10 ఏళ్లదాకా ఒసామా బిన్ లాడెన్ ను పట్టుకోలేకపోయింది. కానీ పెహల్ గాం ఘటన జరిగిన 15 నిమిషాల్లోనే పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకపోయి ఉగ్రవాదులను, ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టిన గొప్ప చరిత్ర భారత సైన్యానికుంది.

ఈటల రాజేందర్, హరీష్ రావు భేటీ అయ్యారనే విషయం నాకు తెలియదు. ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా. కవిత విషయంలోనూ ఇదే డ్రామా నడుస్తోంది. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిర్మాణ, దర్శకత్వంలో ‘‘చార్ పత్తా’’ సినిమా నడుస్తోంది. ఇందులో కేసీఆర్ ను జోకర్ గా మార్చారు. నేనడుగుతున్నా. కవిత ఎపిసోడ్ తో ప్రజలకు ఏమైనా మేలు జరుగుతోందా? మీడియా కూడా ఆలోచించాలి. 6 గ్యారంటీలపై చర్చ జరగకుండా చిట్ చాట్ ల పేరుతో ప్రజల ద్రుష్టి మళ్లించే కుట్ర జరుగుతోంది. మీకు తెలుసు కదా గతంలో బీఆర్ఎస్ పాలనలో చాలా మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లోకి వచ్చినప్పుడల్లా కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని, నాకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని మాయ మాటలు చెప్పి వాళ్లను బీజేపీలోకి వెళ్లకుండా చేశారు. అసలు బీఆర్ఎస్ అంటేనే కుటుంబ, అవినీతి పార్టీ, అవినీతి పార్టీ. కవితను అరెస్ట్ చేయకుండా ఉండటానికి బీజేపీతో కలవడానికి బీఆర్ఎస్ ప్రయత్నించింది. కానీ అట్లాంటి అవినీతి, కుటుంబ పార్టీని మేం దగ్గరకు కూడా రానీయ్యలేదు. అసలు కుటుంబ పార్టీలకు బీజేపీ దూరం. ఇవన్నీ తెలిసే ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు కల్వకుంట్ల ఆర్ట్స్ ప్రొడక్షన్ లో కాంగ్రెస్ నిర్మాతగా, డైరెక్టర్ గా ‘చార్ పత్తా’ సినిమాను నడిపిస్తున్నరు. వాళ్లు ఎన్ని డ్రామాలాడినా బీఆర్ఎస్ ను దగ్గర తీసే ప్రసక్తే లేదు. ఆ పార్టీతో పొత్తు ఊసే ఉండదు.ప్రజలు అన్నీ గమనించారు. కాంగ్రెస్ దొంగ హామీలను, బీఆర్ఎస్ మోసాలను కళ్లారా చూశారు. బాధలు పడ్డారు. అందుకే ఈసారి కాంగ్రెస్ కు గుణ పాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారు. దీంతోపాటు ‘‘అందరికీ ఇచ్చాం అవకాశం ఈసారి బీజేపీకి ఇద్దాం అవకాశం’’అని ప్రజలు నిర్ణయానికి వచ్చారు.ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నాయి. వాళ్లెన్ని కుట్రలు చేసినా బీజేపీని అధికారంలోకి రాకుండా ఈసారి అడ్డుకోలేరు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.