Take a fresh look at your lifestyle.

యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లండి

  • జిల్లా కేంద్రాల్లోనూ ర్యాలీలు నిర్వహించాలి.
  • ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించి మాక్ డ్రిల్ చేపట్టాలి.
  • ఇతర రాష్ట్రాల్లోని ప్రజల కోసం తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.
  • హై లెవెల్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 

ముద్ర, తెలంగాణ బ్యూరో: ​యుద్ధ వాతావరణం సందర్భంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీస్ అధికారులు సమగ్రమైన యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు . ​గురువారం సచివాలయంలో ఆయన అధ్యక్షతన హై లెవెల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ తోపాటు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎంఓ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్,డిజిపి జితేందర్, డిజీ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, రాచకొండ సిపి సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, ​ప్రజల్లో జాతీయ వాదాన్ని పెంపొందించడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని వర్గాల ప్రజలతో సంఘీభావ ర్యాలీని నిర్వహించాలన్నారు. అందుకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించుకోవాలని సిఎస్ రామకృష్ణారావును ఆదేశించారు.

​ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నిన్న నిర్వహించిన సంఘీభావ ర్యాలీ సమాజానికి మంచి సంకేతాన్ని ఇచ్చిందని అభిప్రాయపడ్డారు.​సున్నితమైన అంశాల గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేసి కట్టడి చేయాలన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు.​24 గంటల ముందే ప్రజలను అప్రమత్తం చేసి మాక్ డ్రిల్ ట్రయల్ నిర్వహించాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు.​అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సెలవులను రద్దుచేసి వారి హెడ్ క్వార్టర్ లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి, వార్తా ప్రచారాల్లో తగు జాగ్రత్తల కోసం మీడియా అధిపతులతో సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఇక నగరంలో సైరన్ అలర్ట్ ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అందుకు సంబంధించిన పరికరాలు ఎక్కడున్నా కొనుగోలు చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు.అనంతరం ​ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు చెప్పా రు.దేశ రక్షణలో కీలక పాత్ర వహిస్తున్న రక్షణ శాఖకు సంబంధించిన పరికరాల తయారీకి సంబంధించిన పరిశ్రమల వద్ద కట్టుదితమైన భద్రతను ఏర్పాటు చేశామని మాక్ డ్రిల్ లో వీళ్లందరని కూడా భాగస్వాములు చేశామని తెలిపారు.​ఆస్పత్రి భవనాల స్లాబు పైన ఎరుపు రంగుతో ప్లస్ గుర్తును ఏర్పాటు చేసుకోవాలని అన్ని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు.​అత్యవసర నిధులు సమకూర్చుకోవడం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జనాలను అప్రమత్తం చేయడం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటిస్తూ క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నట్టు సి‌ఎస్ రామకృష్ణ రావు వివరించారు.

రాష్ట్ర డిజిపి జితేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని, రైల్వే స్టేషన్స్ బస్టాండ్లు వద్ద భద్రత పెంచినట్లు చెప్పారు. హైదరాబాదులో ఉన్న డిఆర్ డిఏ, డి ఆర్ డి ఓ, ఎన్ ఎఫ్ సి తదితర జాతీయ స్థాయి పరిశ్రమల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 24/7 పెట్రోలింగ్ నిర్వహిస్తూ  సీసీ టీవీల ద్వారా మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు.సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారం కాకుండా సైబర్ టీంలను ఏర్పాటు చేసి ఎప్పటి కప్పుడు తప్పుడు వార్తలను కట్టడి చేయడం తో పాటు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు డి‌జి‌పి వివరించారు. ​కేవైసీ లేకుండా సిమ్ కార్డులు జారీ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచామని వివరించారు.​రాష్ట్రంలో ఉత్పన్నమయ్యే అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు ముందస్తుగా చేసుకున్నాము అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెంచామని డి‌జి‌పి తెలిపారు.ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసి పర్యవేక్షణ చేయడానికి హైదరాబాద్ కేంద్రంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము.గతంలో కేసులు నమోదయి జైలు జీవితం అనుభవించి విడుదలైన వారి కదలికల పట్ల నిఘా పెంచామని వారి ప్రతి కదలికను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.​ఉక్రెయిన్ దేశంలో యుద్ద౦ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రత్యేకంగా యాప్ రూపొందించారని, అలాంటి యాప్ రాష్ట్రంలో తీసుకురావడం కోసం ఆలోచన చేస్తున్నట్లు సమావేశంలో డి‌జి‌పి వివరించారు.

Leave A Reply

Your email address will not be published.