- 2030 నాటికి గరిష్ట విద్యుత్ డిమాండ్ 24215 మెగావాట్లకు చేరుతుందని అంచనా.
- 2030 నాటికి 511 కు చేరనున్న ఇహెచ్ టి సబ్ స్టేషన్లు 4031 కు 33/11 కెవి సబ్ స్టేషన్లు .
- రాష్ట్రంలో 23 సోలరైజ్డ్ మోడల్ గ్రామాలు, రెండు సోలరైజ్డ్ మోడల్ మండలాలు.
- రానున్న ఐదు సంవత్సరాల ప్రణాళిక సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి.
ముద్ర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం పలు అంతర్జాతీయ సంస్థలకు ప్రముఖ గమ్యస్థానంగా ఎదుగుతోందని ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇటీవల, పలు అంతర్జాతీయ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మాస్యూటికల్, మాన్యుఫాక్చరింగ్ సంస్థలు తమ కార్యకలాపాలను తెలంగాణలోనే విస్తరిస్తున్నాయన్నారు. దీని కారణంగా రాష్ట్రం లో అంచనాలకు మించి విద్యుత్ డిమాండ్ నమోదవుతున్నదన్నారు. గతేడాదితో పోల్చుకుంటే గరిష్ట డిమాండ్ దాదాపు 10 శాతం పెరిగినా సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ ఉద్యోగులందరూ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.రాష్ట్రంలో పెరుగుతున్న భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యం గా రానున్న ఐదు సంవత్సరాలకు సంబంధించి రూపొందిస్తున్న కార్యాచరణ ప్రణాళికలపై శుక్రవారం సచివాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్ తరాలకు సైతం నాణ్యమైన విద్యుత్ సరఫరా నిత్యం అందుబాటులో ఉండేందుకు ఇప్పటి నుండే కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంస్థల కార్యాచరణ విజయవంతంగా పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. దీనికి తోడు ఇప్పటి వరకు కేవలం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉండే విద్యుత్ సామాగ్రి స్టోర్ లు, నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతి జిల్లా కేంద్రంలో ఒక విద్యుత్ స్టోర్ ఏర్పాటు చేయాల్సిందిగా సీఎండీ లను ఆదేశించారు. కాగా2030 నాటికి గరిష్ట విద్యుత్ డిమాండ్ 24,215 మెగావాట్లకు చేరుతుందని అంచనాలు ఉన్న నేపథ్యంలో
ఇహెచ్ టి సబ్ స్టేషన్లు 511 కు, 33/11 కెవి సబ్ స్టేషన్లు 4031 కు రాష్ట్రంలో 23 సోలరైజ్డ్ మోడల్ గ్రామాలు, రెండు సోలరైజ్డ్ మోడల్ మండలాలను నెలకొల్పాలని సూచించారు.కాగా ఈ సమీక్షలో విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా… విద్యుత్ సంస్థల సీఎండీలు రానున్న ఐదు సంవత్సరాల్లో నమోదయ్యే డిమాండ్ అంచనాలు, దానికి తగ్గట్టు గా సంస్థలు చేపట్టబోతున్న కార్యాచరణపై నివేదికలు ప్రవేశపెట్టారు.ఇందులో భాగంగా జెన్ కో, ట్రాన్స్ కో, ఉత్తర , దక్షిణ పంపిణి సంస్థల, రెడ్ కో ల ప్రస్తుత పరిస్థితిని మంత్రికి నివేదించారు. ఈ నెల ఒకటవ తేదీ నాటికి ప్రస్తుత కెపాసిటీ 20,883 మెగావాట్లు కాగా, మొత్తం కాంట్రాక్ట్డ్ కెపాసిటీ తో కలిపి 26183 మెగా వాట్లుగా ఉన్నదన్నారు. ఆర్ధిక సంవత్సరం 2030 నాటికి గరిష్ట విద్యుత్ డిమాండ్ 24,215 మెగావాట్లకు చేరనుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనా వేసిందన్నారు. ఈ డిమాండ్ ను ఎదుర్కొనేందుకు గాను సింగరేణి, ఎన్ టిపిసి, జెన్ కో వంటి విద్యుత్ ఉత్పాదన సంస్థలు తీసుకుంటున్న చర్యలను నివేదించారు.
అనంతం ట్రాన్స్ కో చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ, 2024 లో నమోదయిన గరిష్ట విద్యుత్ డిమాండ్ తో పోల్చుకుంటే ఈ ఏడాది గరిష్ట డిమాండ్ లో 9.8 శాతం పెరిగిందన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో అత్యధిక డిమాండ్ 16877 మెగావాట్లకు చేరుకుంటుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనా వేశారన్నారు. కానీ వాస్తవంలో గరిష్ట డిమాండ్ 17162 మెగావాట్లుగా రికార్డు అయిందన్నారు. ప్రస్తుతం తమ ట్రాన్స్ ఫర్మేషన్ కెపాసిటీ 41954 ఎంవిఎ గా ఉన్నదన్నారు. డిసెంబర్ 2023 – మే 2025 లో 3158ఎంవిఎ కెపాసిటీ జోడించామన్నారు. ప్రస్తుతం 389 గా ఉన్ ఇహెచ్ టి సబ్ స్టేషన్ల ను 2030 నాటికి అదనంగా 122 నిర్మించడం ద్వారా 511 కు పెంచేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు.దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ, మాట్లాడుతూ సంస్థ పరిధిలో గతేడాది 9862 మెగావాట్లుగా వున్న గరిష్ట డిమాండ్ ఈ ఏడాది 10.48 శాతం పెరుగుదలతో 11017 మెగావాట్లకు పెరిగిందన్నారు. ఈ ఏడాది 10 వేల మెగావాట్ల మైలురాయిని సునాయాసనంగా ఛేదించామన్నారు.తెలంగాణ రాష్ట్రములోనే బహుళ జాతి సంస్థలకు గమ్యస్థానంగా నున్న సైబర్ సిటీ సర్కిల్ పరిధిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోల్చుకుంటే 33.69 శాతం పెరిగిందన్నారు. సంస్థ పరిధిలో గత ఏడాది లో జరిగిన విద్యుత్ వినియోగాన్ని బట్టి, ఆ ప్రాంతాలను నాలుగు కాటగిరీలుగా విభజించమన్నారు. ఐదేండ్ల కార్యాచరణ కు సంబంధించి నూతనంగా 5330 ఎంవిఎ కెపాసిటీ కలిగిన 410 33/11 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణానికి తగు ఏర్పాట్లు చేశామన్నారు.
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ, సంస్థ పరిధిలో గతేడాది 5816 మెగావాట్లుగా వున్న గరిష్ట డిమాండ్ ఈ ఏడాది 6281 మెగావాట్లకు పెరిగిందన్నారు.మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా గరిష్ట డిమాండ్ 24.64 శాతం పెరిగిందన్నారు.తమ సంస్థ పరిధిలో కూడా డిమాండ్ పెరుగుతున్న ప్రాంతాలను మూడు కేటగిరీలుగా విభజించమన్నారు. ఐదేండ్ల కార్యాచరణ కు సంబంధించి నూతనంగా 1710ఎంవిఎ కెపాసిటీ కలిగిన 342 సబ్ స్టేషన్ల నిర్మాణానికి తగు ఏర్పాట్లు చేశామన్నారు. రెడ్ కో వైస్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ అనిల మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో 7913 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం గల ప్లాంట్లు ఉన్నాయని, 2030 నాటికి 19874 మెగావాట్లకు చేరేలా చర్యలు తీసుకున్నామన్నారు. దీనికి తోడు తెలంగాణ క్లీన్, గ్రీన్ ఎనర్జీ పాలసీ లో భాగంగా డిస్ట్రిబ్యూటెడ్ రేనేవబుల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్, జియో థర్మల్, ఇవి ఛార్జర్స్, గ్రీన్ హైడ్రోజన్ వంటి విభాగాల్లో సైతం రాణించేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం లో రాష్ట్రంలోని 23 గ్రామాలను మరియు రెండు మండలాలను పూర్తిగా సౌర విద్యుద్దీకరణ మోడల్ గ్రామాలుగా రూపొందించనున్నామన్నారు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా సోలరైజేషన్ చేసేలా ప్రణాళికలు రూపొందించామని మంత్రికి వివరించారు.
Prev Post
Next Post